వేద న్యూస్, కరీమాబాద్:

ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే బాబోయ్‌.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాలనీల్లో గుంపులు, గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంటున్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40 వ డివిజన్ లో ఎటు చూసినా కుక్కలు గుంపు కనబడుతోంది. కరీమాబాద్ రామస్వామి గుడి వీధి లైన్లో ఒంటిరిగా వెళ్లాలంటేనే కాలనీవాసులు జంకుతున్నారు.


ఉదయం వేళ స్కూల్‌ ఆటోల కోసం కాలనీల్లో విద్యార్థులు వేచి ఉంటున్న సందర్భంలో కుక్కల గుంపును చూసిన విద్యార్థులు భయపడుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కుక్కల బారి నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.