= ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పార్టీల దృష్టి
= తప్పులు లేని ఓటర్ల జాబితా కోసం కేంద్రం చర్యలు.
= ఓట్లు తొలగించేందుకే అంటూ అధికార కాంగ్రెస్ ఆరోపణలు
= అప్రమత్తంగా ఉండాలని బీఎల్ఓలకు అవగాహన
= అలసత్వం వహిస్తున్న మంత్రులు, ఎమ్యెల్యేలపై సీఎం సీరియస్
= ప్రతిపక్షాలే దూకుడుగా ఉన్నాయంటూ ఫైర్
= మారకపోతే వేటు తప్పదంటూ 10 రోజుల డెడ్‌లైన్
= క్షేత్రస్థాయిలో క్యాడర్ ను అలర్ట్ చేస్తున్న బీఆర్ఎస్
వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియతో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. పారదర్శకమైన, ఖచ్చితమైన, ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఓ వైపు అధికార యంత్రాంగం చర్యలు వేగవంతం చేయగా.. మరోవైపు రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియపై తమ ‘రాజకీయ’ కన్ను పెట్టాయి. సర్పంచ్ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి ఓటూ అత్యంత కీలకం కావడంతో.. ఓటర్ల చేరికలు, తొలగింపులపై నిఘా పెట్టేందుకు పార్టీలు క్షేత్రస్థాయి శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద రాజకీయ రచ్చకు దారితీస్తోంది.
కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.. నియోజకవర్గాల వారీగా అలర్ట్!
కేంద్ర ప్రభుత్వం ‘సర్’ ప్రక్రియ పేరుతో విపక్షాలకు చెందిన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. తమ అనుకూల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందంటూ విస్తృత ప్రచారం చేస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలంతా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ.. బూత్ లెవెల్ ఏజెంట్లను అలర్ట్ చేస్తున్నారు. ఓటరు జాబితాలో ప్రతి అక్రమ తొలగింపును అడ్డుకోవాలని, కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని నాయకులకు శిక్షణ ఇస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్.. 10 రోజుల డెడ్‌లైన్
ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దృష్టి పెట్టినప్పటికీ.. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. వారి పరిధిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రజాప్రతినిధులపై సీఎం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే 10 రోజుల్లో మీ పద్ధతి మార్చుకోకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలపై వేటు తప్పదు అని ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. తమ పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీలే ఎక్కువగా మీటింగ్‌లు ఏర్పాటు చేసి వారి కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నాయని, కానీ అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ వెనుకబడటంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేతలకు గట్టి క్లాస్ తీసుకున్నారు.
క్షేత్రస్థాయిలో గులాబీ దళం అలర్ట్
ఇటు భారత రాష్ట్ర సమితి సైతం ‘సర్’ ప్రక్రియపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఎక్కడికక్కడ ముఖ్యనేతలు డివిజన్లు, గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు డిజిటల్ హాజరు, ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. అధికార పార్టీ ఓట్ల బదలాయింపునకు లేదా అక్రమ చేరికలకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతో గులాబీ శ్రేణులు ప్రతి బూత్ పరిధిలోనూ గట్టి నిఘా ఏర్పాటు చేశాయి. ఏది ఏమైనప్పటికీ, కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన ‘సర్’ ప్రక్రియతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ పూర్తి స్థాయిలో అలర్ట్ కావడంతో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడే ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
