- 2047 లోపు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ: ముఖ్యమంత్రి
వేద న్యూస్, హైదరాబాద్ :
డిజిటల్ భద్రత జీఎస్ఈసీ ప్రధాన లక్ష్యమని, గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ, తమది ఇన్నోవేటివ్ ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్ఈసీ కేంద్రాన్ని ప్రారంభించడం గర్వకారణంగా ఉందని అన్నారు.
ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతుందని, డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే క్షేమంగా ఉన్నట్లేనని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనే నూతన ఆవిష్కరణలు, విధానాలు తీసుకొచ్చామని, విద్యార్థులు సర్టిఫికెట్లు పొందుతున్నారు కానీ స్కిల్స్ లేవని అన్నారు. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతుందని తెలిపారు. 2035లోపు 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ మారాలని, 2047లోపు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ మారాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నామని, తెలంగాణ మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారని అన్నారు.
కాగా ఏషియా పసిఫిక్ ప్రాంతంలో రెండో కేంద్రంగా గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను నెలకొల్పారు. ప్రపంచంలో ఇది నాలుగో సెంటర్ ను హైదరాబాద్‌లో ప్రారంభించడం విశేషం. ఏషియా పసిఫిక్ రీజియన్‌లో సురక్షిత డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. దీంతో ఐటీ రంగంలో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ జీఎస్ఈసీ ప్రారంభ కార్యక్రమంలో గూగుల్ గవర్నమెంట్ అఫేర్స్ – పబ్లిక్ పాలసీ వైస్-ప్రెసిడెంట్ విల్సన్ ఎల్ వైట్, గూగుల్ యాడ్ స్పేసెస్ వైస్-ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్ తో పాటు సంస్థ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
