= బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే బలమైన నేత ఎక్కడ?
= వర్గాలుగా నాయకుల విభజన.. కార్యకర్తల్లో గందరగోళం!
= ఒకవేళ అసెంబ్లీకి బై‘పోల్’ వస్తే నాయకత్వం ఏది?
= క్షేత్రస్థాయిలో సమన్వయ లోపాలు.. గ్రూపులుగా శ్రేణులు డివైడ్?
= రాష్ట్రస్థాయిలో పార్టీ పిలుపు మేరకు సెగ్మెంట్ స్థాయిలో నడిపించే నాథుడేడి?
= ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలో నాడు నెగ్గిన ఈటల రాజేందర్ నేడు మల్కాజిగిరి ఎంపీ..
= సెగ్మెంట్‌తో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ కుమార్‌కు అనుబంధం
= మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి సెగ్మెంట్‌తో సంబంధాలు.. ఆయన వైపు మొగ్గు?
= ప్రస్తుతం మల్కాజిగిరిపైనే ఈటల రాజేందర్ ఫోకస్.. రంగంలోకి త్వరలో ఆయన కోడలు?
= తెర మీదకు ఈటల క్షమిత పేరు!
= ఈ తరం యువ మహిళా నేతగా ఆమెకు గుర్తింపు
వేద న్యూస్, అంబీర్ శ్రీకాంత్: (పెన్ సింబల్)
హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి నేతలు, కార్యకర్తలు, అభిమానుల బలం నిండుగా, మెండుగా ఉంది. కానీ, ముందుండి నడిపించే నాయకుడు లేకపోవడంతో కేడర్ డీలా పడుతోంది. కార్యకర్తల్లో ఓ మేరకు గందరగోళం ఏర్పడుతోంది.! నాడు నాటి రాష్ట్ర ప్రభుత్వం భూమి, ఆకాశాన్ని ఏకం చేసినా..! ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను గెలిపించడంలో ఆ మేరకు బీజేపీ శ్రేణులు కీలకంగానే పని చేశాయి. అయితే, తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓటమిని చవిచూశారు. అనంతరం ఆయన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై తన మకాం అక్కడికి మార్చుకున్నారు. సమాయభావ పరిస్థితులు, వీలును బట్టి హుజూరాబాద్ ప్రజలతోనూ ఆయన సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ సెగ్మెంట్లో బీజేపీ తరఫున లీడర్‌గా రాబోయే అసెంబ్లీ లేదా ఒకవేళ బై పోల్ వస్తే పార్టీని విజయతీరాలకు చేర్చగలిగే వారు ఎవరు? హుజూరాబాద్ కమల రథ‘సారథి’గా ఎవరు నిలుస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ప్రస్తుత హుజూరాబాద్ ఎమ్మెల్యేపై వేటు పడి బై ‘పోల్’ కనుక వస్తే బీజేపీ బరిలో నిలిచి సత్తా చాటగలదా..? పార్టీ ఈ విషయమై దృష్టి సారించాలని స్థానిక కార్యకర్తలంటున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీకి నాయకత్వం వహించే బలమైన బీజేపీ లీడర్‌ను నియమిస్తే.. కేడర్ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తుందని చెబుతున్నారు.
సమిష్టిగా ముందుకుసాగాలి
హుజూరాబాద్ శాసనసభ్యుడిగా సుమారు 20 ఏండ్ల పాటు పని చేసిన ఈటల రాజేందర్.. అనుచరవర్గం ఓ గ్రూపుగా.. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ అనుచరవర్గం మరో గ్రూపుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలున్నాయి. కాగా, ఈటల, బండి కలయిక నేపథ్యంలో శ్రేణుల్లోనూ సమన్వయానికి అడుగులు పడ్డాయి. కానీ, హుజూరాబాద్‌లో కమల రథ సారథిగా ఎవరో ఒక నేతను నియమిస్తేనే పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా, బలంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. పార్టీ కోసం కష్టపడి పని చేయడానికి క్షేత్రస్థాయి కేడర్ సిద్ధంగా ఉంది. అయితే, నాయకత్వం తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గాలు అనేవి లేకుండా అందరినీ ఏకం చేసి ముందుకు నడిపించే నాయకత్వం ఉంటే కనుక గెలుపు కోసం పని చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ అభిమానులు స్పష్టం చేస్తున్నారు. కేడర్ సై అంటున్నా.. సరైన లీడర్ లేకుంటే.. ఎన్నికల యుద్ధంలో గెలుపు కష్టమని పలువురు చెబుతున్నారు.
పార్టీని నడిపించేదెవరు?
పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో విస్తృత సంబంధాలు కలిగి ఉన్నాయి. నిత్యం జనంతో మమేకమై ముందుకు సాగుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన హుజూరాబాద్ నుంచి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ నియోజకవర్గ ప్రజానీకంతో నడుస్తూ.. వారికి అండగా నిలుస్తూ.., పార్టీ శ్రేణులకు దగ్గరగా ఉంటూ.. అన్ని చోట్ల పర్యటిస్తుంటారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు సన్నిహితుడిగానూ ఆయనకు పేరుంది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంపైన గంగాడి కృష్ణారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. 20 ఏండ్ల పాటు హుజూరాబాద్ శాసన సభ్యుడిగా సేవలందించిన ఈటల రాజేందర్.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కోడలు క్షమితను రంగంలోకి దింపుతారనే చర్చ ఉన్నది. మల్కాజిగిరి ఎంపీగా ఈటల రాజేందర్ బిజీగా ఉన్నప్పటికీ హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేతల ద్వారా జనం శ్రేయస్సు కోసం పని చేస్తున్నారు. ఈ తరం జెన్ జీ యువ మహిళా నేత గా సేవా మార్గం లో ముందున్న క్షమిత ను హుజురాబాద్ బీజేపీ నేత గా ఎమ్మెల్యే అభ్యర్థి గా రంగంలోకి దించుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ లో క్షమిత ప్రచారం చేశారు. హైదరాబాద్ పరిధి లో వివిధ కార్యక్రమాలలో ఆమె చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో క్షమిత వంటి యువ లీడర్ ను హుజురాబాద్ కమల రథ సారథి గా నియమిస్తారా? అనే ప్రశ్నలకు హై కమాండ్ సమాధానం చెప్పాల్సి ఉంది.కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉన్న సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం.. ఈ సెగ్మెంట్‌పైన చాలా కాలం నుంచి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ నియోజకవర్గంలోని ద్వితీయ స్థాయి స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు, నిధులు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సెగ్మెంట్లో బీజేపీ లీడర్షిప్పైనా ఆయన కూడా ఫుల్ ఫోకస్ పెడుతున్నట్లు పార్టీ వర్గాల టాక్. ఆయన ఎవరిని తెర మీదకు తీసుకొస్తారో తెలియదు. అంతేగాకుండా తెర వెనకుండి పార్టీని హుజూరాబాద్‌లో నడిపించాలని ఎవరైన నేతలు భావిస్తున్నారా? వారికి అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయా? అనేది కూడా పార్టీ పెద్దలు తేల్చాల్సి ఉంటుంది.
దిశానిర్దేశం కోసం ఎదురుచూపులు
బీజేపీ హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి అడుగులు పడుతున్నాయి. కానీ, నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఆ మేరకు పూర్తిస్థాయిలో కేడర్ పార్టీ విశ్వాసంలో ఉండి.. ఒకే చోట ఉండేలా పరిస్థితులు అయితే లేవు. భిన్నవర్గాలుగా నేతల విభజన ఉండటంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఈ అంశాలపైన హై కమాండ్ దృష్టి సారించాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వస్తోంది. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపాలు ఉండటమే కాదు నేతలు గ్రూపులుగా డివైడ్ కాకుండా ఉండేందుకు పార్టీ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. హుజూరాబాద్ కమల రథ సారథిగా ఓ నేతకు బాధ్యతలు అప్పగించినట్లయితే సదరు లీడర్ అందరినీ ఏకోన్ముఖంగా నడిపించగలిగే వారు అయి ఉండాలని అంటున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న కేడర్‌ను కాపాడుకోవాలంటే తక్షణమే హై కమాండ్ ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలని, నాయకత్వంపైన దిశానిర్దేశం చేయాలని, ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని స్థానిక కార్యకర్తలు కోరుతున్నారు.