వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామంలో సమస్యలే సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తున్నది. సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులే నెలకొన్నాయని ప్రజలు అంటున్నారు.

గ్రామంలో దాదాపు రూ.2 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డు నిరుపయోగంగా మారింది. ఇక గ్రామంలో సేకరించిన చెత్తను.. డంపింగ్ యార్డు పక్కనే కాల్చుతున్నారు. దానితో పర్యావరణం కాలుష్యమయం అవడమే కాకుండా ప్రజలు శ్వాస కోస సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశం ఉంది.
గ్రామంలో పారిశుధ్య నిర్వహణపైన పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నట్టు పలువురు ఊరు ప్రజలు ఆరోపిస్తున్నారు. మురుగు నీరు రోడ్ల మీదకు రావడం, రోడ్ల పక్కనే చెత్తా చెదారం ఉండటం కనిపిస్తోంది. ఫలితంగా దోమల బెడదతో జనం ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుత వానాకాలం నేపథ్యంలో సీజనల్ డిసీజెస్ ముప్పు పొంచి ఉన్నదని భయాందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వహణను సంబంధిత శాఖ వారు పట్టించుకోవాలని కోరారు.

గ్రామపంచాయతీలోని నర్సరీ కి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేస్తోంది. కానీ ఈ గ్రామంలో నర్సరీలో ఖాళీ బ్యాగులు కనిపిస్తున్నాయి. బ్యాగుల్లో గడ్డి మాత్రమే దర్శనమిస్తున్నది. ఇంత జరుగుతున్నా ఉన్నత స్థాయి అధికారులు.. ఏ మాత్రం పట్టించుకోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసరగొండ గ్రామంలో చేపట్టిన క్రీడా ప్రాంగణం ఉపయోగంలో లేకుండా పోయింది. పశువుల మేతకు మాత్రమే అది ఉపయోగపడుతుండటం గమనార్హం.

సంబంధిత అధికారులు వెంటనే పసరగొండ గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని ఊరి ప్రజలు కోరుతున్నారు.

