‘త్రిశూల్ వ్యూహం’తో అడుగులు
= 5 శాతం ఓట్లపై కన్ను
= గ్రేటర్ హైదరాబాద్, ఏపీ సరిహద్దు జిల్లాలే ఫస్ట్ ప్రియార్టీ
= కేడర్‌ను స్ట్రాంగ్ చేసేలా రోడ్ మ్యాప్
= మున్నూరు కాపు, సెటిలర్లు, యువత ఓట్లే కీలకం
= కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌కు గండి?!
= బీజేపీతో కొనసాగనున్న మిత్రధర్మం
= కింగ్ మేకర్ కావాలని సరికొత్త ప్లాన్
= రాబోయే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలే టార్గెట్
= వచ్చే అసెంబ్లీ సమరమే లక్ష్యంగా కదలికలు

వేద న్యూస్, ఎల్.కే (ప్రత్యేక ప్రతినిధి) :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు సృష్టించి, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన తదుపరి పొలిటికల్ ఫోకస్‌ను తెలంగాణపై కేంద్రీకరించారు. ఏపీలో తిరుగులేని అధికార పీఠాన్ని దక్కించుకున్న ‘తెలుగుదేశం-జనసేన’ కూటమి నేతలు.. తమ తదుపరి టార్గెట్ తెలంగాణేనని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉండి, విభజన తర్వాత బలహీనపడిన క్యాడర్‌కు మళ్లీ జీవం పోసేందుకు ఇరు పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన నేడు హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులతో జరపబోయే కీలక సమావేశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

‘త్రిశూల్ వ్యూహం’తో అడుగులు
ఏపీ కూటమి విజయానికి వెన్నెముకగా నిలిచిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో జనసేన కేవలం నామమాత్రపు పార్టీ కాదని, ఇక్కడ కూడా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తనపై, తన పార్టీపై వస్తున్న విమర్శలకు నేడు ఏర్పాటు చేయబోయే సమావేశం వేదికగా తన స్టైల్‌లో గట్టి కౌంటర్ ఇచ్చేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్న త్రిముఖ పోరును గమనించిన పవన్.. ఇక్కడ ‘త్రిశూల్ వ్యూహం’తో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒంటరిగా, వ్యూహాత్మకంగా పోటీ చేసినా.. అదనంగా 4 నుంచి 5 శాతం ఓటింగ్ సాధిస్తే అది ఇక్కడి ప్రభుత్వాల మనుగడను మార్చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఏపీ సరిహద్దు జిల్లాల్లోనూ జనసేనకు ఉన్న బలమైన యువ ఓటు బ్యాంకే ఆయుధంగా పవన్ రంగంలోకి దిగుతున్నారు.

ప్రధాన పార్టీల్లో గుబులు!
తెలంగాణలో జనసేన పుంజుకుంటే అది ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల ఓటు బ్యాంకును నిలువునా దెబ్బతీసే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలోని సెటిలర్ల ఓట్లు, పవన్ ఇమేజ్ చూసి పడే యువత ఓట్లతో పాటు తెలంగాణలో అత్యంత కీలకమైన ‘మున్నూరు కాపు’ సామాజికవర్గానికి చెందిన ఓట్లు కనుక జనసేన వైపు మళ్లితే.. స్వల్ప మెజారిటీతో గెలిచే స్థానాల్లో ఫలితాలు పూర్తిగా తలకిందులవుతాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓట్లు మళ్లుతున్న తరుణంలో, పవన్ కళ్యాణ్ ప్రవేశం కాంగ్రెస్‌కు కూడా పెద్ద సవాలుగా మారనుంది. పవన్ తన ప్రసంగాల్లో మాట్లాడే ప్రజాస్వామ్య పరిరక్షణ, నిబద్ధత ఇక్కడి యువతను అమితంగా ఆకర్షిస్తుండటంతో.. ఈ 5 శాతం ఓట్లు ఎవరి ఖాతా నుంచి మళ్లుతాయి అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారి, పెద్ద పార్టీలలో గుబులు రేపుతోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపనప్పటికీ.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌కు పెరిగిన గ్రాఫ్, ఇమేజ్ తెలంగాణలో ప్లస్ అవుతుందని కేడర్ నమ్ముతోంది. నేటి మీటింగ్‌లో తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు పవన్ కళ్యాణ్ ఒక పక్కా రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు, 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం కేడర్‌ను స్ట్రాంగ్ చేయాలనే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. బీజేపీతో ఉన్న మిత్రధర్మాన్ని కొనసాగిస్తూనే.. ఇక్కడ స్వతంత్రంగా ఎదగాలని, ఒకవేళ పొత్తులు కుదిరితే అది బీజేపీకి అదనపు బలం అవుతుందని, ఒంటరిగా వెళ్తే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చని పవన్ భావిస్తున్నారు. ఏది ఏమైనా, నేడు భాగ్యనగరం వేదికగా పవన్ కళ్యాణ్ వేయబోయే పొలిటికల్ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *