వేద న్యూస్, కమలాపూర్ :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామపంచాయతీని పారిశుద్ధ నిర్వహణలో జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా గ్రామపంచాయతీ పాలకవర్గం తీసుకున్న గొప్ప నిర్ణయం ఊరి కోసం వారంలో ఒక్కరోజు శ్రమదాన కార్యక్రమం అని ఈ కార్యక్రమం ప్రారంభంలో కొద్దిమంది పాలకవర్గం సభ్యులతో మొదలై క్రమేణా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ నేడు వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని దిగ్విజయంగా నిర్విరామంగా ఏడవ వారానికి చేరుకుందని ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ పబ్బు సతీష్, ఉప సర్పంచ్ పుల్ల శ్రీనివాస్, పాలకవర్గం అందరికీ కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. శనివారం రోజున వారంలో ఒక్కరోజు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాలనీలో ఉన్న చెత్తాచెదారాన్ని ఏరి కాలనీలో నివసిస్తున్న ప్రజలకు చెత్తను ఎక్కడపడితే అక్కడ బయట పారవేయొద్దని, డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలను వేయొద్దని దానివల్ల పరిసరాలు కలుషితమై తమకే వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని వారిలో అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య పరుస్తూ భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని మనం అందించాలని, నాగరికత తెలిసిన మనుషులుగా వ్యవహరిస్తూ పరిసరాలను కలుషితం చేసుకోకుండా పరిశుభ్రంగా ఉంచుకొని ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాతావరణంలో ప్రజలందరూ జీవించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం, కొంతమంది సభ్యులు బాధ్యత తీసుకొని చేస్తే కమలాపూర్ స్వచ్ఛ కమలాపూర్ గా ఎట్టి పరిస్థితుల్లో మారదని ప్రజలంతా కలిసికట్టుగా బాధ్యత తీసుకొని ఎవరి పరిసరాలను వారు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తమ ఊరి బాగు కోసం తాము బాధ్యత తీసుకుంటామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని వాగ్దానం చేసుకొని ఎవరికి వారుగా ప్రజలంతా ముందుకు రావాలని, మన ఇంట్లోని చెత్తాచెదారాన్ని బయట పారవేయకుండా మన ఇంటి వద్దే ఉంచుకొని గ్రామ పంచాయతీకి సంబంధించిన వాహనాలు వచ్చినప్పుడు ఆ వాహనాలలో పారబోయాలని అన్నారు. ఇతర మండలాల నుంచి జిల్లాల నుంచి కమలాపూర్ కి వచ్చి కమలాపూర్ గ్రామాన్ని స్వచ్ఛ కమలాపూర్ గా ఎలా మార్చారు అని మన దగ్గరికి వచ్చి వారంతా తెలుసుకొని పోవాలని ఆ విధమైన ఆదర్శ గ్రామంగా మన గ్రామం తయారు కావాలని ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని ప్రజలంతా ఐకమత్యంగా బాధ్యతతో వ్యవహరిస్తే ఇది తప్పకుండా సాధ్యమవుతుందని అన్నారు.
ఈ సృష్టిలో మనిషి గట్టి సంకల్పంతో ముందడుగు వేస్తే సాధ్యం కానిది అంటూ సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని ఆయన అన్నారు. పారిశుద్ధ కార్మికుల శ్రమను ప్రతి ఒక్కరు గుర్తించాలని వారు చేస్తున్న పనిని గౌరవించాలని వారికి ప్రజలందరూ సహకరించాలని వారు లేకపోతే ఊరు పరిశుభ్రంగా ఉండదని పారిశుద్ధ కార్మికుల వల్లనే చాలావరకు పరిసరాలు, డ్రైనేజీ కాలువలు పరిశుభ్రంగా ఉంటున్నాయని ప్రజలకు వివరిస్తూనే ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులను అభినందించారు. అలాగే ఈ ఊరి కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు, సిబ్బందికి, యూత్ సభ్యులకు, గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
