డిసిగ్నేషన్ మార్చి జీతాలు తగ్గిస్తే ఊరుకునేది లేదు
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన కోతలపై తీన్మార్ మల్లన్న గళం!
కౌన్సిల్లో సమస్యను ప్రస్తావిస్తా.. అవసరమైతే మీతో కలిసి పోరాడుతా
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన తీన్మార్ మల్లన్న
వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి :
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. డిసిగ్నేషన్ మార్పు పేరుతో సంవత్సరాలుగా ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడం అన్యాయమని, ఈ అంశాన్ని కౌన్సిల్లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన లైవ్ వార్తల కార్యక్రమంలో ఉద్యోగుల ప్రతినిధులు తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డిసిగ్నేషన్లు మార్చడం, వేతనాలను తగ్గించడం, సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న సానుకూలంగా స్పందిస్తూ, “మీ సమస్య న్యాయమైనది. మీకు న్యాయం జరిగేలా కౌన్సిల్లో మాట్లాడుతాను. అవసరమైతే మీతో కలిసి నేను కూడా పోరాటం చేస్తాను. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెరిగేలా నా వంతు పూర్తిస్థాయిలో కొట్లాడుతాను” అని భరోసా ఇచ్చినట్లు ఉద్యోగుల ప్రతినిధులు తెలిపారు. సంవత్సరాలుగా ఒకే విధమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల డిసిగ్నేషన్లను మార్చి వేతనాల్లో కోతలు విధించడం వల్ల ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి మద్దతు ప్రకటించిన తీన్మార్ మల్లన్నకు ఉద్యోగుల తరఫున శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తమ సమస్యలను కౌన్సిల్లో ప్రస్తావిస్తానని హామీ ఇవ్వడంపై ఉద్యోగుల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

