• ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్

వేద న్యూస్, మరిపెడ:

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారం జరిగింది. మరిపెడ మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడి రవి తరఫున ఆయన ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. జాటోత్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలు పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, స్నేహా యూత్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ యువ జిల్లా నాయకులు నూకల అభినవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, షేక్ అఫ్జల్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సర్వర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బోడి రవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరిపెడ పట్టణ ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తున్నట్లు నాయకులు తెలిపారు.