- ప్రతిరోజూ మూడు సార్లు సమతుల్య ఆహారం తీసుకోవాలి
- డాక్టర్ ఊడుగుల సురేశ్
వేద న్యూస్, జమ్మికుంట:
మారుతున్న జీవనశైలి వల్ల మానవాళి రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటోంది. కాగా, ఆరోగ్యకరమై లైఫ్ స్టయిల్ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి రోజూ సమయానికి ఆహారం తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వెల్లడిస్తున్నారు.
ఫుడ్ నేయడం, టైమ్‌కు తినకపోయినా.. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు.. రోజుకు మూడు సార్లు సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. నేషనల్ డయాబెటిస్ డే సందర్భంగా మధుమేహం బారిన పడిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు.
డయాబెటిస్ బారిన పడినవారు కచ్చితంగా వారి జీవితకాలమంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్.. ఫైబర్ రిచ్ ఫుడ్స్..ప్రొటీన్…ఆరోగ్యకరమైన కొవ్వు కలిగిన పదార్థాలు తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి మీ కడుపును నిండుగా ఉంచుతాయి, చిరుతిళ్లు తినాలనే కోరికను నియంత్రిస్తాయి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ మీ బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి.
పౌల్ట్రీ, చికెన్, కోడి గుడ్లు, చేపలు,చిక్కుళ్లు,వంటి లీన్ ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి.ప్రోటీన్ ఆకలిని సంతృప్తిపరుస్తుంది. నట్స్, విత్తనాలు, అవకాడోలు, ఆలివ్ నూనె వంటి ఆహార పదార్థాల్లో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు .. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన చిరుతిళ్లకు దూరంగా ఏండాలిజ ఎందుకంటే వాటిలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు టీ లేదా కాఫీ(చక్కెర లేకుండా), 4 బాదం, 2 వాల్ నట్, ఇడ్లీ, సాంబారు, కొబ్బరి పచ్చడి లేదా దోస , కూరగాయల ఉప్మా భాగం చేసుకోవాలి. ఉదయం కొద్దిగా లేట్ అయిన తర్వాత ఏదైనా ఫ్రూట్ ఆపిల్ లేదా ఇతర ఫ్రూట్స్ (2 ముక్కలు), బొప్పాయి (2 ముక్కలు), జామ పండు(మధ్యస్త సైజు), మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. లంచ్ వేళలో దంపుడుబియ్యం, పప్పు లేదా రసం లేదా సాంబారు, పచ్చి ఆకుకూరలు క్యాబేజీ లేదా క్యాలీ ఫ్లవర్ లేదాపాలకూర, కూరగాయల సలాడ్, పెరుగు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి.
సాయంకాలం వేళ చక్కెర లేకుండా టీ లేదా కాఫీ, ఉడకబెట్టిన మిశ్రమ పప్పులు లేదా ఉప్మా లేదా అటుకుల పులిహోర లేదా బిస్కట్ తీసుకోవాలి. పడుకోబోయే ముందు మీగడ తీసిన పాలు తీసుకోవాలి. డిన్నర్‌లో సైతం (లంచ్ మెనూను ఫాలో కావాలి) దంపుడు బియ్యం తీసుకోవాలి.