- సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి
- ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ
వేద న్యూస్, నల్లబెల్లి:
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని తెచ్చుకున్న యూరియా బస్తాల్లో యూరియా లేకుండా గడ్డలు, పొడి రావడంతో రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. పంటలు పచ్చగా నిలవాలన్న ఆశతో పొద్దునక రాత్రనక లైన్లలో నిలబడి యూరియా తెచ్చుకున్నా, చివరికి నాణ్యతలేని ఎరువుతో మోసపోయామన్న బాధ రైతుల్లో వ్యక్తమవుతోంది.
యూరియా బస్తాకు సంబంధించి రైతు దేవ్ సింగ్ మాట్లాడుతూ—”ఇంత కష్టపడి తెచ్చుకున్న యూరియా ఇలా రావడం విచారకరం. ఆగ్రోస్ కార్యాలయంలో అడిగితే ‘మేము ఏం చేయలేం’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇలా అయితే రైతు నష్టపోవాల్సిందేనా?” అని ప్రశ్నించారు.
ప్రస్తుతం వరంగల్ జిల్లాలోనే అనేక ప్రాంతాల నుండి కూడా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులు తమ కష్టానికి తగిన ఫలితం లేకుండా నాసిరకం యూరియాతో నష్టపోతుంటే, బాధ్యత వహించాల్సిన అధికారులు, సంస్థలు మాత్రం కనీస స్పందన చూపకపోవడం ఆవేదన కలిగిస్తోంది.
వ్యవసాయం కోసం యూరియాపై ఆధారపడే రైతులు నష్టపోతే పంట దిగుబడి మాత్రమే కాదు, వారి కుటుంబాల జీవనాధారం కూడా దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆగ్రోస్ సంస్థలు వెంటనే చర్యలు తీసుకుని రైతులకు నాణ్యమైన ఎరువు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.