- వైల్డ్‌లైఫ్ వీక్ సందర్భంగా కాకతీయ జూలాజికల్ పార్క్‌లో ప్రతిభా పాఠవపోటీలు
- విద్యార్థుల్లో అటవీ పర్యావరణ అవగాహన పెంపొందన
వేద న్యూస్, వరంగల్:
వైల్డ్‌లైఫ్ వీక్ సంబరాల సందర్భంగా, అటవీ శాఖ మరియు ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ (ఔల్స్) సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండలోని హంటర్ రోడ్ వద్ద గల కాకతీయ జూలాజికల్ పార్క్‌లో చిత్రలేఖనం (డ్రాయింగ్) మరియు వ్యాసరచన (ఎస్సే రైటింగ్) పోటీలు ప్రతిభా పాఠవ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి మొత్తం 36 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మక ప్రతిభ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ, అటవీ ఆవాసవ్యవస్థల ప్రాముఖ్యత, ప్రకృతి సమతుల్యత, సహజ వనరుల పరిరక్షణ మరియు పర్యావరణ సుస్థిరత వంటి అంశాలపై తమ ఆలోచనలను ప్రతిబింబించారు. ఈ పోటీలు విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను, వన్యప్రాణుల సంరక్షణపై బాధ్యతను మరియు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడ్డాయి.
చిన్న వయస్సులోనే పర్యావరణ సుస్థిరతపై ఆలోచన కలిగించేలా ఈ కార్యక్రమం ఎంతో ప్రేరణాత్మకంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
అటవీ శాఖ అధికారులు మరియు ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులు చూపిన ఉత్సాహం భవిష్యత్ తరాలలో పర్యావరణ పరిరక్షణకు బలమైన పునాది వేస్తుందని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో వన్యప్రాణుల రక్షణపై మరింత చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మరియు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే, పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ ప్రేమ, జీవవైవిధ్య సంరక్షణ పట్ల అవగాహన, మరియు ప్రకృతి పరిరక్షణపై బాధ్యతాభావం మరింత బలపడిందని నిర్వాహకులు ఫౌండర్-ప్రెసిడెంట్, ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ, ఇందారం నాగేశ్వరావు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిభా పాఠవ పోటీలకు సహకరించిన జూ పార్క్ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయ ఘణం, విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, వి ఔల్స్ వాలంటీర్లకు ధన్యవాదములు తెలిపారు.
