= రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనం
= 48 దాటుతున్న ఉష్ణోగ్రతలు
= తెలంగాణలో పదేళ్ల నాటి మే నెల రికార్డులు కనుమరుగు
= వడదెబ్బతో ఒకే రోజు 22 మంది మృత్యువాత
= కూలీలు, రైతులపైనే ఎండల పగ
= పొలాల్లోనే ప్రాణాలు విడుస్తున్న అన్నదాతలు!
= 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
= వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
= ఎండకు తోడైన ఉక్కపోతతో జనం అస్తవ్యస్తం
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు విపరీతమైన ఉక్కపోత తోడవ్వడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థల హెచ్చరికలతో ఉభయ రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో కూడా వేడి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం పరిధిలోని నందనమారెళ్లలో 46.1 డిగ్రీలు, తణుకులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలోని దాదాపు 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీలు నమోదు కాగా, హనుమకొండ జిల్లా ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా, పలుచోట్ల అనధికారికంగా 50 డిగ్రీలు ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.
పదేళ్ల రికార్డులు కనుమరుగు..
సూర్యుడి ఉగ్రరూపంతో తెలంగాణలో పలుచోట్ల గత పదేళ్ల మే నెల ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2019 మేలో నమోదైన 46.3 డిగ్రీల రికార్డును దిలావర్‌పూర్ (46.5 డిగ్రీలు) అధిగమించింది. హనుమకొండ జిల్లాలో 2017 రికార్డును తాజా ఉష్ణోగ్రతలు దాటేశాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి తెలంగాణకు పొడిగాలులు వస్తుండటంతో గాలిలో తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులపై ఇప్పటికే ఎర్ర హెచ్చరికలు (రెడ్ అలర్ట్) జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మునుపెన్నడూ లేనంతగా 244 మండలాల్లో వడగాలులు వీచాయి.
పొలాల్లోనే ప్రాణాలు వదులుతున్న కూలీలు
ప్రస్తుత వడగాల్పుల తీవ్రతకు వడదెబ్బ తగిలి ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 22 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొమ్మిది మంది ఉన్నారు. మరణించిన వారిలో రైతులు, ఉపాధి హామీ కూలీలు, దివ్యాంగులు అధికంగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన రైతు సామ లచ్చిరెడ్డి, కనుకుంట్ల కనకయ్య, కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీష్, ఉపాధి హామీ కూలీ శ్రీపతి లక్ష్మీ ఎండ దెబ్బకు బలయ్యారు. అలాగే సూర్యాపేట, జనగామ, ములుగు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు వడదెబ్బతో మృతి చెందారు.
అప్రమత్తమైన ప్రభుత్వం..
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణాల్లో తక్షణమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది.
మరోవైపు ఊరట నిచ్చే వార్త
ఎండల తీవ్రత ఇలా ఉన్నప్పటికీ, నైరుతి రుతుపవనాల రాక ఆశాజనకంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు వేగంగా ప్రవేశించే అవకాశాలున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసి, వేడి నుంచి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.