= ఎల్సీ ఇచ్చి కరెంట్ వదిలిన లైన్మెన్
= యశోద ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స.. రోజుకు లక్షల్లో బిల్లు..
= ఏడాది పాపతో రోడ్డున పడ్డ అభాగ్యురాలు
= భర్త ప్రాణాలు కాపాడాలంటూ భార్య లక్ష్మణ కన్నీటి విజ్ఞప్తి
= అధికారుల నిర్లక్ష్యానికి గ్రామస్తుల ఆగ్రహం
= ధర్పల్లి సబ్ స్టేషన్ ముట్టడి.. రోడ్డుపై బైఠాయింపు
= లైన్మెన్ నిర్లక్ష్యం.. గతంలోనూ ముగ్గురు బలి
= కింది స్థాయి సిబ్బంది తప్పులను కప్పిపుచ్చుతున్న ఏఈ
= ‘చిన్న సంఘటనే’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం
వేద న్యూస్, నిజామాబాద్
తరచూ ఎక్కడో ఒకచోట విద్యుత్ ఘాతానికి అభాగ్యులు బలవుతున్నా, విద్యుత్ శాఖ అధికారులలో మాత్రం చలనం రావడం లేదు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గోవింద్ పల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక పేద కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న అధికారులు.. ప్రాణాంతకమైన పనులను చేయడానికి ప్రైవేట్ వ్యక్తులను హెల్పర్లుగా వాడుకుంటూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ధర్పల్లి మండలం లైన్మెన్ ప్రవీణ్ చేసిన నిర్లక్ష్యపు పనికి కనకం నాగేష్ అనే యువకుడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
ఎల్సీ ఇచ్చి కరెంట్ వదిలారు
గ్రామంలోని విద్యుత్ సమస్యను సరిచేయడానికి లైన్మెన్ ప్రవీణ్ ఎల్సీ (లైన్ క్లియరెన్స్) ఇచ్చినట్లే ఇచ్చి, ఆ తర్వాత నిర్లక్ష్యంగా మరల కరెంటు సరఫరాను పునరుద్ధరించాడు. లైన్మెన్ ఎల్సీ ఇచ్చాడనే భరోసాతో నాగేష్ కరెంటు స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా హైవోల్టేజ్ కరెంట్ సరఫరా కావడంతో స్తంభంపైనే విద్యుత్ ఘాతానికి గురై కింద కుప్పకూలాడు. నాగేష్తో పాటు ఉన్న కర్రోల్ల శ్రీనివాస్ వెంటనే స్పందించి ఆయన్ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
సబ్ స్టేషన్ ముట్టడి.. బయటపడ్డ బండారం
ఈ దారుణ ఘటనతో ఆగ్రహానికి గురైన గోవింద్ పల్లి గ్రామస్తులు రాత్రికి రాత్రే ధర్పల్లి సబ్ స్టేషన్‌ను ముట్టడించి, రోడ్డుపై బైఠాయించారు. సబ్ స్టేషన్లో విచారించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఆపరేటర్‌గా విధులు నిర్వహించాల్సిన వ్యక్తి లేకపోగా, కనీస అర్హత లేని కిరణ్ అనే వాచ్‌మెన్‌ను ఆపరేటర్‌గా కూర్చోబెట్టారు. లైన్మెన్ ప్రవీణ్ అందుబాటులో లేకపోవడంతో, నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎల్సీ ఇచ్చినట్లు బహిరంగంగా ఒప్పుకోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. గతంలోనూ ఇదే లైన్మెన్ నిర్లక్ష్యం వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోయారని, ప్రైవేట్ హెల్పర్ గంగయ్య అనే వ్యక్తి కూడా గతంలో ఇలాగే తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల వల్లే ఘోరం
గ్రామస్తులు న్యాయం కోసం నిలదీయగా, ధర్పల్లి విద్యుత్ శాఖ ఏఈ రూప్ సాయి బాధ్యతారహితంగా మాట్లాడారు. ఇంత చిన్న సంఘటనను ఇంత పెద్దది చేయడం ఏంటి? అంటూ బాధితులపైనే వాగ్వాదానికి దిగడం ఆయన కింది స్థాయి సిబ్బంది తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలకు తావిస్తోంది. నిర్లక్ష్యానికి కారణమైన ఏఈ రూప్ సాయి, లైన్మెన్ ప్రవీణ్ కుమార్, వాచ్మెన్ కిరణ్‌లను వెంటనే విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రూపాయి లేని పేద కుటుంబం..
విద్యుత్ శాఖ పాపానికి ఒక పేద కుటుంబం సర్వస్వం కోల్పోయే స్థితికి చేరింది. ప్రమాదానికి గురైన కనకం నాగేష్కు భార్య లక్ష్మణ, ఒక సంవత్సరపు చిన్న పాప ఉన్నారు. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుటుంబం కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రోజుకు ఒక లక్ష రూపాయలకు పైగా అవుతున్న వైద్య ఖర్చులను భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తప్పు చేసిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని, నాగేష్ కుటుంబానికి పూర్తి వైద్య ఖర్చులు అందించి న్యాయం చేయాలని గోవింద్ పల్లి గ్రామస్తులు, బాధితుడి కుటుంబ సభ్యులు దీనంగా వేడుకుంటున్నారు.