= 10న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభం
= వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
= గ్లోబల్ టెక్స్టైల్ మ్యాప్‌పై తెలంగాణ సరికొత్త ముద్ర
= వేల కోట్ల పెట్టుబడులు.. లక్షలాది ఉపాధి అవకాశాలే లక్ష్యం
= పదమూడు వందల ఎకరాల సువిశాల పారిశ్రామిక నగరం
= పొలం నుంచి విదేశీ ఎగుమతుల వరకు అభివృద్ధి
= వరంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభ్యం
= అత్యాధునిక మౌలిక సదుపాయాలతో భారీ క్లస్టర్
= రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సరికొత్త పారిశ్రామిక ఇంజిన్
= స్థానిక యువతకు సొంత జిల్లాలోనే మెరుగైన ఉద్యోగాలు
వేద న్యూస్, తెలంగాణ బ్యూరో
తెలంగాణను గ్లోబల్ టెక్స్టైల్ మ్యాప్‌లో నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం మిత్రా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ మెగా ప్రాజెక్ట్ తయారీ, ఉపాధి మరియు ఎగుమతుల రంగంలో దేశానికే దిక్సూచిగా మారనుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. మే 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ మెగా టెక్స్టైల్ పార్క్, తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లడమే కాకుండా, ఓరుగల్లు వస్త్ర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తయారీ, ఉపాధి, ఎగుమతుల రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది.
దేశంలోనే అతిపెద్ద బ్రౌన్‌ఫీల్డ్ టెక్స్టైల్ హబ్
సుమారు 1,327 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్క్, దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కులలో ఒకటిగా రికార్డు సృష్టించనుంది. పీఎం మిత్రా పథకం కింద ఎంపికైన ఏడు పార్కుల్లో, ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీలో ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. అత్యాధునిక రోడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, భారీ నీటి లభ్యత మరియు డ్రైనేజీ వ్యవస్థలతో ఈ పార్కును ఒక అంతర్జాతీయ పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దారు.
రూ. 6వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రారంభంలో రూ. 1,695.54 కోట్లు వ్యయం చేయగా, దీని ద్వారా వచ్చే మొత్తం పెట్టుబడులు రూ. 6వేల కోట్లకు పైగా చేరుతాయని అంచనా వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే వివిధ జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి రూ. 3,800 కోట్లకు పైగా పెట్టుబడులు ఖరారయ్యాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరడంతో పాటు పారిశ్రామిక వృద్ధి రేటు గణనీయంగా పెరగనుంది.
5ఎఫ్ విజన్.. పొలం నుంచి ఫ్యాషన్ వరకు ఒకే చోట
ఈ టెక్స్టైల్ పార్క్ కేవలం కర్మాగారాల సమూహం మాత్రమే కాదు.. ఇది ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు అయిన 5ఎఫ్.. అంటే ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.. ఫార్మ్ నుంచి ఫైబర్.. రైతులు పండించిన పత్తికి ఇక్కడే మద్దతు ధర లభిస్తుంది. ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ.. పత్తి నుంచి నూలు, నూలు నుంచి వస్త్రాన్ని ఇక్కడే తయారు చేస్తారు. ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్.. ప్రపంచ స్థాయి డిజైన్లతో ఆధునిక వస్త్రాల రూపకల్పన జరుగుతుంది. ఫ్యాషన్ నుంచి విదేశాలకు… ఇక్కడ తయారైన మేడ్ ఇన్ తెలంగాణ వస్త్రాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తారు.
లక్షలాది మందికి ఉపాధి కల్పన..
వరంగల్, చుట్టుపక్కల జిల్లాల యువతకు ఈ పార్క్ ఒక గొప్ప ఉపాధి కేంద్రంగా మారనుంది. వేలాది మందికి ప్రత్యక్షంగానూ, లక్షలాది మందికి పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా నేత కార్మికులు, టెక్స్టైల్ రంగ నిపుణులకు తమ సొంత గడ్డపైనే మెరుగైన జీవనోపాధి దొరకడం వల్ల, పనుల కోసం ఇతర ప్రాంతాలకు జరిగే వలసలు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఎగుమతులకు ఊతమిచ్చే అంతర్జాతీయ కేంద్రం
ప్రపంచస్థాయి సమగ్ర టెక్స్టైల్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ పార్క్ తయారీ, ఎగుమతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించనుంది. నాణ్యమైన వస్త్రాల తయారీకి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఇది దేశ ఎగుమతుల రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.