= రానున్న రోజుల్లో ధరల భారం ముంచెత్తనుందా
= హైదరాబాద్ వేదికగా ప్రధాని ‘ముందస్తు జాగ్రత్త’ పిలుపు
= గడ్డు పరిస్థితులకు సంకేతమనే భయం
= దేశ వ్యాప్తంగా మొదలైన చర్చ
= రానున్న రోజుల్లో మరింత మండిపోనున్న చమురు
= అంతర్జాతీయ మార్కెట్లో 50% పెరిగిన ముడిచమురు
= ఇంధన పొదుపు, ప్రజా రవాణా, వర్క్ ఫ్రమ్ హోమ్..
= భారతీయుల జీవనశైలి మారబోతుందా?
= గల్ఫ్ యుద్ధ మేఘాలు, ట్రంప్ నిర్ణయాలతో సామాన్యులపై తీవ్ర ప్రభావవం
= ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
మధ్యప్రాచ్య దేశాల్లో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ సామాన్యుడి వంటింట్లో పొగలు చిమ్ముతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బారెల్‌కు రికార్డు స్థాయికి చేరుతుండటంతో, దేశంలో చమురు కంపెనీలు భరించలేనంత నష్టాల్లో కూరుకుపోయాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ధరలను నియంత్రించినా, ఇకపై అది అసాధ్యమని ఆర్థిక నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాబోయే ‘ధరల సునామీ’కి ముందస్తు హెచ్చరికలుగా కనిపిస్తున్నాయి.
సామాన్యుడు అతలాకుతలం..
రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితాన్ని అడుగడుగునా దెబ్బతీసే ప్రమాదం ఉంది. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి, నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పులు, పాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుంది. రైతాంగం కూడా ట్రాక్టర్లు, పంపుసెట్ల వాడకంపై పెరిగే పెట్టుబడి భారంతో విలవిలలాడే అవకాశం ఉంది. చమురు సంస్థలు ఆర్థికంగా దెబ్బతింటే భవిష్యత్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడి, దేశ ప్రగతి కుంటుపడుతుంది. జపాన్, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే భారీగా ధరలు పెంచగా, భారత్ కూడా అదే బాటలో నడవక తప్పని స్థితి కనిపిస్తోంది. ప్రజలు ఇప్పుడే పొదుపు బాట పట్టి, రాబోయే ధరల సునామీని తట్టుకునేందుకు సిద్ధం కావాల్సి ఉంది
హైదరాబాద్ సభలో మోదీ సంకేతం..
సాధారణంగా ఎన్నికల వేళ లేదా అభివృద్ధి పనుల శంకుస్థాపనల వేళ ప్రధాని ప్రసంగాలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ, హైదరాబాద్ వేదికగా మోదీ చేసిన ప్రసంగంలో భవిష్యత్తుపై ఆందోళన స్పష్టంగా కనిపించింది. ‘ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలి.. వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణాను ఆశ్రయించాలి.. అవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయొద్దు’ అని ఆయన పిలుపునివ్వడం వెనుక పెను ప్రమాదం దాగి ఉంది. చమురు ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అప్పుడు సామాన్యుడి బడ్జెట్ అతలాకుతలం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించాలని ఐటీ రంగ సంస్థలకు సూచించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది.
లక్ష కోట్ల నష్టం.. చమురు సంస్థల విలవిల
భారతదేశంలోని ప్రధాన చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 50 శాతం పెరిగినా, భారత్‌లో పెట్రోల్ రూ. 94.77, డీజిల్ రూ. 87.67 వద్దే ఉంది. ఈ వ్యత్యాసం వల్ల ఈ సంస్థలకు రోజుకు రూ. 1,600 నుంచి రూ. 1,700 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఇప్పటివరకు ఈ అండర్ రికవరీ నష్టం రూ. 1 లక్ష కోట్లు దాటిపోయింది. చమురు సంస్థలు దివాళా తీయకుండా ఉండాలంటే ధరలు పెంచడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ. 10 నుంచి రూ. 20 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గల్ఫ్ యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న గల్ఫ్ వార్ విధానాలు అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాను దెబ్బతీశాయి. భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులో మెజారిటీ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అక్కడ యుద్ధం వల్ల సరఫరా ఆగితే లేదా ధరలు పెరిగితే, మన దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగి రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇది సామాన్యుడి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుంది.
ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా?
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 13 నుంచి రూ. 3 కి, డీజిల్‌పై సున్నాకు తగ్గించి సామాన్యుడిని ఆదుకునే ప్రయత్నం చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి నెలకు రూ. 14వేల కోట్ల ఆదాయం గండి పడుతోంది. ఇంత చేస్తున్నా అంతర్జాతీయ ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వం చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అందుకే మోదీ ప్రజలను స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నారు.