మరో పంజాబ్‌లా మారుతోందా?
= డేంజర్ జోన్లో యువత భవిష్యత్తు!
= రకరకాల మత్తు పదార్థాలకు బానిసగా
= చిన్న వయసులోనే మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలు
= మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్న అఘాయిత్యాలకు
= కుటుంబాల ఆర్థిక పతనం
= ప్రభుత్వ తీరుపై మేధావుల విమర్శలు
= ఇప్పటికైనా కళ్లు తెరవాలంటూ సూచన
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా విరాజిల్లిన ఈ నేల, నేడు మద్యం మత్తులో ఊగిసలాడుతోంది. రాష్ట్రం మద్యం వినియోగంలో ప్రమాదకర స్థాయికి చేరుకుందని, తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టకపోతే తెలంగాణ మరో పంజాబ్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
ఛిద్రమవుతున్న కుటుంబాలు
నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చెప్పుకుంటాం, కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. చదువుకున్న నిరుద్యోగులు తమ కలలు సాకారం చేసుకోలేక, బ్రాందీ షాపుల బాట పడుతున్నారు. యుక్త వయస్సు నుంచే యువత బీరు, విస్కీ వంటి మత్తు పానీయాలతో పాటు డ్రగ్స్, గంజాయి వంటి ప్రాణాంతక వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఈ మత్తు ప్రభావంతో విచక్షణ కోల్పోయి, అభం శుభం తెలియని పసికందులపై, ఆడపడుచులపై అఘాయిత్యాలకు పాల్పడుతూ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, జీవన శైలిని కోల్పోయి అగాధంలోకి నెట్టబడుతున్నాయి.
90 శాతం ప్రజలు డేంజర్ జోన్లో
మత్తు పదార్థాల వినియోగంపై నిపుణులు వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు 90 శాతం ప్రజలు ఏదో ఒక రకమైన మత్తు పానీయాలకు లేదా పదార్థాలకు అలవాటు పడి డేంజర్ జోన్లో ఉన్నారని అంచనా. గతంలో పంజాబ్ రాష్ట్రం ఇలాగే మద్యం మత్తులో మునిగి, ఆపై ప్రమాదకరమైన డ్రగ్స్ సంస్కృతిలోకి జారిపోయింది. తెలంగాణ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోందని, ఇది భావితరాల మనుగడకే ముప్పు అని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ తీరుపై విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా, పరిమితికి మించి బ్రాందీ షాపులను ప్రోత్సహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగుల కలలు బ్రాందీ షాపులకు అంకితమవుతుంటే, ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా సొమ్ము చేసుకుంటోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, విద్యా నైపుణ్యాలతో కూడిన విలువలను పెంచడం వంటి పనులను విస్మరించి, కేవలం మద్యంపైనే దృష్టి పెట్టడం వల్ల సమాజం అధోగతి పాలు అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్పు రావాలి.. మనుగడ సాగాలి!
మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదని, మన చేతులతో మన కంటిని పొడుచుకున్నట్టుగా ఈ మత్తు సంస్కృతి తయారైందని మేధావులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి. యువతలో మార్పు రావాలని, వారిని విద్యావంతులుగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దేలా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. భావితరాలకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.