•  ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాలుడికి నిర్లక్ష్య వైద్యం ఘటనలో..
  •  బాధితుడికి ఆస్పత్రిపై తీసుకున్న యాక్షన్‌ సమాచారం ఇవ్వండి:  ఎన్‌హెచ్‌ఆర్‌సీ  

వేద న్యూస్, వరంగల్:

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) హనుమకొండ బాలసముద్రంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య వైద్య ఘటనపై స్పందించింది. బాధితులు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఈ ఏడాది మార్చి 3న ఫిర్యాదు చేయగా, కమిషన్ లా విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అతుల్ కుమార్ స్పందించారు. సదరు ఘటనపై ఎంక్వయిరీ జరిపి, తగు చర్యలు 8 వారాల్లో తీసుకోవాలని, యాక్షన్ తీసుకున్న సమాచారాన్ని బాధితులకు తెలియజేయాలని రాష్ట్ర హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీని కమిషన్ ఆదేశించింది.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన బాధితులు కొక్కు సదానందం-సునీత తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుమారుడైన తనీష్‌ను 2023 ఆగస్టు 5న హనుమకొండ బాలసముద్రంలోని శ్రీ ఉదయ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో అపెండిస్ ఆపరేషన్ చేయించారు. కాగా, ఆ వైద్యం వికటించిందని, బాలుడికి తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

డాక్టర్‌ను సంప్రదిస్తే.. పెద్దాస్పత్రికి తరలించాలని చెప్పారు. దాంతో తనీష్ కుటుంబీకులు యశోద ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ముందుచేసిన సర్జరీ వికటించిందని తెలిపి, మళ్లీ అక్కడ ట్రీట్ మెంట్ చేయగా, భారీగా ఖర్చు అయింది. శ్రీఉదయ్ ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంపై బాధితులు పోరాటం చేస్తున్నారు. సదరు హాస్పిటల్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సైతం కంప్లయింట్ చేయగా, తాజాగా కమిషన్ సైతం స్పందించి.. తెలంగాణ రాష్ట్ర హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది.