•  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్
  • హుజురాబాద్‌ను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని విమర్శ
  • అవకాశం ఇస్తే యువత నైపుణ్య అభివృద్ధి కోసం పాటు పడతానని హామీ

వేద న్యూస్, జమ్మికుంట ప్రతినిధి:
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించినట్లయితే హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మున్సిపాలిటీ కొత్తపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమక్సంలో యువకులు, మహిళలు పార్టీలో చేరగా..వారికి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. ఇక మిగిలిందల్లా మహిళామణుల ఆశీర్వాదంతో మెజారిటీ పెరగడం ఎంతని లెక్కలేయాల్సి ఉందన్నారు.

గెలిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల లోపు అమలు చేసి నియోజకవర్గంలోని ప్రతీ గడపకు వచ్చి మహిళామణులో చేతుల్లో పెట్టి మరొక్కసారి ఆశీర్వాదం తీసుకుంటానని మహిళలను ఉద్దేశించి అన్నారు. ఇల్లాలే ఇంటికి దీపమని..అలాంటి మహిళా మణులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విస్మరించాయని, కాంగ్రెస్ పార్టీ హయాంలో 350 రూపాయలకు దొరికిన గ్యాస్ సిలిండర్ ను ఇప్పుడు కేంద్రంలోని బిజెపి సర్కారు, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారు ఇద్దరు కలిసి ఒకరికొకరు పోటీపడుతూ రూ.1,000కి పైగా చేసి మహిళలకు తీవ్ర ద్రోహం చేశారని ప్రణవ్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో యువతకు నైపుణ్య అభివృద్ధి కోసం ప్రతీ మండల కేంద్రంలో లైబ్రరీలు, స్టడీ సెంటర్లను చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి తన ప్రతిభ పాటలను పెంపొందించుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని యువతకు హామీనిచ్చారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు ఒకే తాను ముక్కలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు వీలుగా నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి…ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు.

కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య, హుజురాబాద్ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు ఇంగిలె రామారావు, కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి అరుకాల వీరేశలింగం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, ఇమ్రాన్, సజ్జు, సలీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.