= పేదల ఇళ్లకు పైసలు అడిగితే ఊరుకునే ప్రసక్తే లేదు
= వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలి
= లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే ఖబడ్డార్
= ప్రజలను పీడిస్తే చూస్తూ పట్టించుకోననుకున్నారా?
= ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులకు కొండా మురళీ మాస్ వార్నింగ్
= కమిటీ సభ్యులను పిలిపించి హెచ్చరించిన మాజీ ఎమ్మెల్సీ
= బాధిత ప్రజల్లో హర్షం.. కొండా మురళీపై ప్రశంసల జల్లు

వేద న్యూస్, ఎల్.కే (ప్రత్యేక ప్రతినిధి)
పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం కొందరు దళారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల వల్ల అబాసుపాలవుతోంది. అర్హులైన పేదలకు గూడు కల్పించాలనే ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొందరు స్వార్థపరులు క్యాష్ చేసుకొనే పనిలో పడ్డారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఈ నేపథ్యంలో, లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైనా సరే తాట తీస్తా అంటూ మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత కొండా మురళీ కాంగ్రెస్ శ్రేణులకు అత్యంత ఘాటుగా హెచ్చరించారు. పేద ప్రజలను పీడిస్తూ వారి నుంచి సొమ్ము గుంజుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.

ఇందిరమ్మ కమిటీలకు క్లాస్
తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లకు సంబంధించిన కొందరు కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు కొండా మురళి దృష్టికి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆయన నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులను ప్రత్యేకంగా పిలిపించి సమావేశం నిర్వహించారు. పేదల పథకంలో అవినీతి నీడ పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులైన వారికి గట్టిగా క్లాస్ పీకారు.

వెంటనే వాపస్ ఇవ్వాలి..
సమావేశంలో కొండా మురళీ మాట్లాడుతూ.. ఎవరెవరైతే ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారో, వారు తక్షణమే ఆ సొమ్మును సంబంధిత బాధితులకు తిరిగి ఇచ్చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రజలను పిడిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. వసూలు చేసిన డబ్బులను వెంటనే వెనక్కి ఇవ్వకపోతే పార్టీ పరంగానే కాకుండా చట్టపరంగా కూడా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

లీడర్ అంటే ఇలా ఉండాలి
ఇందిరమ్మ ఇళ్ల కమిటీల అక్రమాలపై కొండా మురళీ తీసుకున్న ఈ ఆకస్మిక, కఠినమైన నిర్ణయంపై తూర్పు నియోజకవర్గ సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకులు తప్పు చేసినా వెనకేసుకురాకుండా, పేదల పక్షాన నిలబడి నిలదీసిన కొండా మురళీ నిజమైన ప్రజా నాయకుడంటూ ప్రజలు కొనియాడుతున్నారు. లీడర్ అంటే ఇలాగే ఉండాలని, ఈ హెచ్చరికతోనైనా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ హెచ్చరికతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో కొత్త ధీమా వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *