- విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు
- రిటర్నింగ్ అధికారికి సెట్ పత్రాల సమర్పణ
వేద న్యూస్, వరంగల్:
వరంగల్ లోని గిర్మాజీపేట్‌కు చెందిన యువకుడు, విద్యావంతుడు ఇజ్జగిరి కమలాకర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి సెట్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) నుంచి తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగాన్ని అంతమొందిచడమే లక్ష్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ)ని తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యెచ్చు సునీల్ స్థాపించినట్లు వివరించారు.
మార్పు కోసం వరంగల్ తూర్పు నియోజకర్గ ప్రజలు వీఆర్పీ వైపు చూడాలని కమలాకర్ కోరారు. విద్యార్థుల రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ‘రైతు బంధు’ కింద ఏడాదికి రైతులకు రూ.36 వేలు ఇస్తామని, విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే 2.60 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. 36 వేల మంది నిరుద్యోగులు ఏకమై పెట్టిన పార్టీ వీఆర్పీ (విద్యార్థుల రాజకీయ పార్టీ) అని స్పష్టం చేశారు. క్రికెట్ బ్యాట్ గుర్తుపై విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను తూర్పు ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఇజ్జగిరి కమలాకర్ అభ్యర్థించారు.