- ఆశీర్వదించి ఒక అవకాశం కల్పించండి
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
- గులాబీ పార్టీ వెంటనే ప్రజలు ఉన్నారని ధీమా
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
ఓటమి భయంతో రాజకీయ లబ్ధి పొందేందుకు తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆదరించి తనను ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరారు.
ప్రజా సంక్షేమం కోసం కృషిచేసిన సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ వెంటే నియోజకవర్గ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న నాయకులు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకులు సృష్టిస్తున్న అపోహలను ప్రజలు ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
గత 20 ఏళ్లుగా ఈటల రాజేందర్ ను ఏడుసార్లు గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికల కష్టకాలంలో కూడా గెలిపిస్తే కనీసం రెండున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నియోజవర్గానికి రాకపోవడం బాధాకరమని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ మాయమాటలతో ప్రజలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి పేరుతో బిజెపి బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది బిజెపి పార్టీ అని ఆరోపించారు.
తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో హుజురాబాద్ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. గత 15 సంవత్సరాలుగా మీకోసమే సేవ చేస్తున్నానని, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి మరింత సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు.
మూడోసారి కూడా తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. కానిపర్తి గ్రామంలో కూడా గెలిచిన రెండు నెలల్లోపు పోచమ్మ గుడి అద్భుతంగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిపోయిన రోడ్లు, భవనాలు, కాలువలు ఏమీ ఉన్నా పూర్తి చేస్తానన్నారు.
గత 15 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నప్పటికీ మా కుటుంబమంతా మీ వెంటే ఉన్నామని కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని అన్నారు. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తన వెన్నంటే ఉంటానని తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అని, ఈ ప్రాంతంలో వేరే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి జరగదని తెలిపారు. అనంతరం ప్రతీ మహిళకు బొట్టుపెట్టి ఓటు వేయాలని అభ్యర్థించారు.
అనంతరం బిజెపి నుంచి సీనియర్ నాయకులు కౌశిక్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దేశరాజు పల్లి గ్రామంలోని బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండి పాషా, కార్యదర్శి ఒగ్గోజు సదయ్య, బూతు అధ్యక్షుడు కృష్ణతో పాటు కొంతమంది నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. హుజురాబాద్ అభివృద్ధి జరగాలంటే కౌశిక్ రెడ్డి తోనే సాధ్యమని బిఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు.