• ప్రజాసమస్యలే ఎజెండాగా అవినీతి లేని పాలన అందిస్తా
  • భూపాలపల్లి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రవిపటేల్ హామీ
  • 17వ నెంబర్ ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన

వేద న్యూస్, భూపాలపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతీ ప్రజా సమస్య మీద అలుపెరుగని పోరాటం చేస్తూ..ఎంతో మందికి ఆపరేషన్లు చేయడంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటూ..అవినీతి లేని పాలన అందించేందుకు వస్తున్న తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రవిపటేల్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గం లో తీన్మార్ మల్లన్న టీం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తీన్మార్ రవి పటేల్ పోటీగా తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా తనకు ఎయిర్ కండిషనర్ (ఏసీ) గుర్తు వచ్చిందని తీన్మార్ రవి పటేల్ వెల్లడించారు. ఈవీఎంలో 17వ నెంబర్ మీద తన గుర్తు ఏసీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భూపాలపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఏమీ లేదని విమర్శించారు. గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే గెలిచారని కానీ, అభివృద్ధికి భూపాలపల్లి నోచలేదని అన్నారు. ప్రజా సమస్యల ఎజెండాగా విద్య, వైద్యం, సత్వర న్యాయం, రైట్ టు రీకాల్ తో పాటు అవినీతి లేని పరిపాలన చేసేందుకు ఒక బహుజన బిడ్డగా జనం ముందుకు వస్తున్న తనకు మద్దతు తెలపాలని కోరారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో మూడు జాతీయ పార్టీలలో.. ఇద్దరు రెడ్డిలు, ఒక వెలమ వాళ్లకి జాతీయ పార్టీల అవకాశాలు ఇచ్చారని, స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడి స్థానిక బిడ్డగా ఉన్న తనను ఈసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నవించారు. జాతీయ పార్టీలు చెప్పే మ్యానిఫెస్టోను ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దని కోరారు. అలాగే వారిని ఆ హామీలు ఎలా అమలు చేస్తారో నిలదీయాలని రవి పటేల్ ప్రజలను కోరారు. మీ ఓటు ఒక ఆయుధంగా ఉండాలని చెప్పారు. గుర్తులను చూసి కాదు వ్యక్తిని చూసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో గుడి కంటి విష్ణు, గండు కరుణాకర్, పిట్టల వెంకటేష్, సామల చంద్రశేఖర్, సంతోష్ పాల్గొన్నారు.