- భూపాలపల్లి, వరంగల్ తూర్పు నుంచి క్యాండిడేట్‌గా..
- స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు స్థానాల్లో బీసీ బిడ్డ పోటీ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
రాష్ట్రంలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ ముఖ్యనేత, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, ఈ మాదిరిగానే ఒక సామాన్యుడు సైతం రెండు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. అయితే, అతను స్వతంత్ర అభ్యర్థి కావడం విశేషం. వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ వ్యక్తి కౌటం రవిపటేల్. రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తన అదృష్టాన్ని రవిపటేల్ పరీక్షించుకోబోతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గొర్లవీడుకు చెందిన కౌటం రవిపటేల్..తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ మెంబర్ గా జిల్లా ప్రజలకు ఐదేండ్ల నుంచి నిర్విరామంగా సేవలందిస్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా ఉంటూనే..తనకు తోచినంతలో వారి కష్ట, నష్టాల్లో అండగా నిలుస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజానీకానికి నిత్యం అందుబాటులో ఉండే రవిపటేల్‌కు..యువత మద్దతు నిండుగా, మెండుగా ఉండటం విశేషం.

ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతుగా పోరాటం చేస్తూనే..తాను సొంతంగా చేయగలిగిన పనులను రవిపటేల్ తన సొంత నిధులతో చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎంతో మందికి వైద్యం విషయమై ఆర్థిక సహాయ సహకారాలు అందించడంతో పాటు ఆపరేషన్లు చేయించారు. ప్రకృతి విపత్తుతో పాటు కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచారు.

తీన్మార్ మల్లన్న టీమ్ తరఫున రవిపటేల్ అందరికీ నిత్యావసరాలను అందజేశారు. మొరంచపల్లి గ్రామంలో ప్రజలకు నిత్యావసరాలను అందజేయడంతో రవిపటేల్ టీమ్ ముందు నిలిచింది. ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తూ..వారిలో చైతన్యం నింపుతూ..ప్రజలకు రవిపటేల్ భరోసానిస్తున్నారు.

యువకెరటంలా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో 30 వేల మంది టీమ్ సభ్యులతో బలమైన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా నియోజకవర్గ పరిధిలో రవిపటేల్ బలంగా దూసుకెళ్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ తీన్మార్ మల్లన్న టీమ్ తరఫున రవిపటేల్ తన వాయిస్ వినిపించేందుకు ముందుకు సాగుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తానని హామీనిస్తున్నారు.

తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రవిపటేల్ వెల్లడించారు.

బహుజనవాదిగా, బీసీ మున్నూరు కాపు ముద్దు బిడ్డగా జనం ముందరకు వస్తున్న తనను ఆదరించి..ఆశీర్వించాలని రవిపటేల్ వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. భూపాలపల్లిలో రవిపటేల్ ఎన్నికల గుర్తు ఏసీ(ఏయిర్ కండిషనర్) కాగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా రవిపటల్ కు రోటీ మేకర్ గుర్తు కేటాయించారు.