= మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్
వేద న్యూస్, మంథని:
మంథని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రత్యేకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలను పూర్తిగా శుభ్రపరచడంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, అన్ని వార్డుల్లో స్ట్రీట్ లైట్లను అప్‌డేట్ చేస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్ర లింగయ్య, ఎల్లంకి వంశీ, స్థానిక వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.