= సీఎంఆర్ పేరిట ఓ రైస్ మిల్లర్ మాయాజాలం
= సుమారు రూ.80 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్ము ఎగవేత
= కనపర్తి రైస్ మిల్లులో అంతులేని అక్రమాలు
= లక్ష క్వింటాళ్ల ధాన్యం గోల్‌మాల్
= పాతవి ఇవ్వరు.. కొత్తవి వాటినీ వదలరు
= అయినా మళ్లీ ధాన్యం కేటాయించిన అధికారులు
= రాష్ట్ర వ్యాప్తంగా ఎగవేత మిల్లులపై ప్రభుత్వం చర్యలు
= ‘మల్లన్న’కు మాత్రం మినహాంపు ఎందుకో?
= అవినీతి అడ్డు లేకుండా అధికారులకు భారీగా ముడుపులు
= గోనె సంచుల లెక్కల్లోనూ భారీగా అవకతవకలు
వేద న్యూస్, ఫోకస్ టీమ్ :
మిల్లర్ల మాయాజాలం అంతా ఇంతా కాదు.. సీఎంఆర్ పేరిట కోట్లు కొల్లగొట్టి దర్జాగా తిరుగుతున్నారు కొందరు మిల్లర్లు. అంతేకాదు.. పాత బకాయిలు చెల్లించకుండానే మళ్లీ అదే మిల్లుకు ధాన్యం కేటాయించుకొని మళ్లీ పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్మును ఎగ్గొంటేందుక ఎత్తుగడలు వేస్తున్నారు.
హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం కనపర్తి గ్రామంలో ఉన్న ఓ రైస్ మిల్లు ఇప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రభుత్వం నుంచి వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించి, తిరిగి బియ్యం ఇవ్వకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని యజమాని దిగమింగుతున్నాడు. సుమారు రూ. 80 కోట్ల మేర ప్రభుత్వానికి బాకీ ఉన్నా, యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో కాసుల బేరం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పాత బాకీ తీర్చకముందే..
మిల్లులో నిల్వలు ఏమయ్యాయో తెలీదు.. పాత బియ్యం లెక్కలు తేలలేదు.. కానీ అధికారుల ఆశీస్సులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన ఈ మిల్లుకు, తాజాగా మళ్లీ ధాన్యం కేటాయించడం విస్తుగొలిపే అంశం. ప్రతిరోజూ వరుస కడుతున్న వాహనాలే దీనికి నిదర్శనం. గత లెక్కలు తేల్చకుండానే, ప్రస్తుతం కూడా సుమారు ట్రక్కుల్లో ధాన్యం మిల్లుకు దిగుమతి కావడం చూస్తుంటే, నిబంధనలను ఎంతలా తుంగలో తొక్కారో అర్థమవుతోంది.
మిల్లు యజమాని ఖతర్నాక్ ప్లాన్!
సాధారణంగా ఒక్కో ఏసీకే కింద 430 క్వింటాళ్ల వరకు వడ్లు దిగుమతి అవుతాయి. ఇలాంటివి సుమారు 200 ఏసీకేలు, అంటే లక్ష క్వింటాళ్లకు పైగా ధాన్యం ఈ మిల్లుకు చేరింది. అయితే, ఇందులో మెజారిటీ ధాన్యం మిల్లులో ఉండాల్సింది పోయి, రాత్రికి రాత్రే బయట మార్కెట్‌కు తరలిపోతున్నట్లు సమాచారం. చివరికి గోనె సంచుల విషయంలో కూడా లక్షల రూపాయల గోల్‌మాల్ జరుగుతోందని, లెక్కల్లో చూపించే సంచులకు, మిల్లులో ఉన్న వాటికి అస్సలు పొంతన లేదని తెలుస్తోంది.
అధికారుల బదిలీలే అస్త్రం..
ఈ మిల్లు యజమాని రాజకీయ పలుకుబడి బాగా ఉందని జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ మిల్లుపై తనిఖీలు చేసి, అక్రమాలను వెలికితీసే ప్రయత్నం చేసిన ఒక జాయింట్ కలెక్టర్ ను సైతం తన పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తో బదిలీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. తప్పును ప్రశ్నించే అధికారులను సాగనంపుతూ, సహకరించే అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ఈ అక్రమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. రెవెన్యూ రికవరీ యాక్ట్ తనను ఏమీ చేయలేదన్న ధీమా సదరు యజమానిలో కనిపిస్తోంది.
సీజ్ చేయాలని ప్రజల డిమాండ్
కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా తింటున్న ఈ మిల్లుపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమంగా కేటాయించిన ధాన్యాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా, తక్షణమే మిల్లును సీజ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వ ఖజానాకు మరిన్ని కోట్లు గండి పడటం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు.