వేద న్యూస్, నల్లబెల్లి:

వేసవికాలం ప్రారంభంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ పి.బి. ఆచార్య సూచించారు. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నారులు అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా నీడలో ఉండాలని, సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. వడదెబ్బ, విరేచనాలు వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. మసాలా, మాంసాహారాన్ని తగ్గించి, ఓఆర్‌ఎస్ ద్రావణం, పండ్లరసాలు, ఎక్కువగా నీరు తీసుకోవాలని సూచించారు. కాటన్ దుస్తులు ధరించడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.