= కాంగ్రెస్ కు ‘మునుగోడు’ సెగ..!
= అడ్డంకిగా సామాజిక సమీకరణాలు
= నల్లగొండలో ఇప్పటికే ఇద్దరు రెడ్డి మంత్రులు
= నో చెబుతున్న ‘ఒకే కుటుంబం.. ఒకే పదవి’ నిబంధన
= పదవి దక్కకుంటే పార్టీ వీడే అవకాశాలే ఎక్కువ
= అదే జరిగితే కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ
= క్రమంగా దూరం కానున్న అసంతృప్తి రెడ్డి నేతలు
= ముందు నొయ్యి.. వెనుక గొయ్యిలా పార్టీ పరిస్థితి
= పార్టీకి నష్టం ప్లాన్ చేస్తున్న అధిష్టానం
వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో ఒకే ఒక పేరు మార్మోగుతోంది.. అదే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దూకుడున్న నేతగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలమైన పట్టున్న నాయకుడిగా పేరున్న రాజగోపాల్ రెడ్డికి ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమేనా? లేక సమీకరణాల సాకుతో ఆయనకు మొండిచేయి ఎదురుకానుందా? అసలు గాంధీ భవన్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు జరుగుతున్న చర్చలేంటి? దీనిపై ‘వేద న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
అడ్డంకిగా మారిన సమీకరణాలు
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా చేస్తున్న ప్రధాన అంశం జిల్లా, సామాజిక సమీకరణాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు హేమాహేమీలు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి స్వయానా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యమేనా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఆయనకు పదవి ఇస్తే, ఇతర సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధిష్టానం ఆలోచిస్తోంది.
‘ఒకే కుటుంబం-ఒకే పదవి’ ఫార్ములా..
కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ‘ఒకే కుటుంబం – ఒకే పదవి’ అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి కట్టబెడితే, పార్టీలోని ఇతర సీనియర్ నేతల నుంచి అసమ్మతి సెగలు రేగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఫార్ములా రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఉత్తర తెలంగాణ వర్సెస్ దక్షిణ తెలంగాణ
మరో కీలక అంశం ప్రాంతీయత. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులంతా దాదాపు దక్షిణ తెలంగాణ (నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి) జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఉత్తర తెలంగాణ (ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) జిల్లాల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని, సామాజిక సమతుల్యత కోసం ఉత్తర తెలంగాణ నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. ఇదే జరిగితే రాజగోపాల్ రెడ్డికి అవకాశం తలుపులు మూసుకుపోయినట్లేనని కొందరు విశ్లేషిస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి బలం.. పార్టీకి ఉన్న అనివార్యత
పైన పేర్కొన్న సమీకరణాలు వ్యతిరేకంగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డిని కాదనలేని పరిస్థితి కూడా పార్టీలో ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డికి ఉన్న కేడర్ , మాస్ ఫాలోయింగ్ సామాన్యమైనది కాదు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, సొంత బలంతో పార్టీని గెలిపించగల సత్తా ఉన్న నేత. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఆయన చూపిన తెగువ, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషిని అధిష్టానం తక్కువ అంచనా వేయడం లేదు. ఆయనను విస్మరిస్తే భవిష్యత్తులో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక వర్గం వాదిస్తోంది.
రాజగోపాల్ రెడ్డి రూటు మారుస్తారా?
గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీలో కొందరు నేతలు తనను తొక్కిపెట్టాలని చూస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవేళ ఈసారి కూడా మంత్రి పదవి దక్కకపోతే, ఆయన పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేత బయటకు వెళ్తే, అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై, సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ భయపడుతోంది.
ముందు నొయ్యి.. వెనుక గొయ్యి..
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు తారుమారవుతాయి.. ఇవ్వకుంటే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉంది. ఈ డెడ్ లాక్ ను అధిష్టానం ఎలా ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్రస్థాయిలో కీలక పదవి లేదా ఇతర హామీలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే, రాజగోపాల్ రెడ్డి కేవలం మంత్రి పదవి తప్ప దేనికీ సంతృప్తి చెందరని ఆయన అనుచరులు చెబుతున్నారు.