ధర్పల్లిలో రేషన్ కార్డుల దందా..?
రేషన్ కార్డు రాకపోవడంతో అధికారులతో లబ్ధిదారుల వాగ్వాదాలు
కొందరికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు ప్రచారం
మధ్యవర్తులు, రెవెన్యూ ఉద్యోగుల పాత్రపై అనుమానాలు
ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజల డిమాండ్

వేద న్యూస్, నిజామాబాద్ ప్రతినిధి:
పేద ప్రజలకు ఉచితంగా అందాల్సిన రేషన్ కార్డుల పేరుతో కొందరు రెవెన్యూ ఉద్యోగులు, మధ్యవర్తులు భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ధర్పల్లి రెవెన్యూ కార్యాలయంలో రేషన్ కార్డుల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందకుండా అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవనాధారంగా ఉండే రేషన్ కార్డులను కొందరు సొమ్ము చేసుకునే సాధనంగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కొత్త రేషన్ కార్డు కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు వసూలు చేశారనే సమాచారం స్థానికంగా చక్కర్లు కొడుతోంది. కొంతమంది లబ్ధిదారులు డబ్బులు చెల్లించినప్పటికీ రేషన్ కార్డులు రాకపోవడంతో సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరికి తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరికి మాత్రం త్వరలో వస్తాయి అంటూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీతాలు తక్కువైనా విలాసవంతమైన జీవితం గడుపుతున్న కొందరు ఉద్యోగుల ఆస్తులపై కూడా గ్రామాల్లో చర్చ మొదలైంది. ఖరీదైన వాహనాలు, ఆడంబరమైన ఇళ్లు, కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లల చదువులు వంటి అంశాలు ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు.. లేకపోతే దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్ అన్నట్టుగా కొందరు ఉద్యోగుల వ్యవహారశైలి ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ధర్పల్లి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన రేషన్ కార్డుల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మంజూరైన రేషన్ కార్డుల జాబితాను పూర్తిగా పునఃపరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *