వేద న్యూస్, చౌదర్ గూడా : 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అత్యంత ఘోరమైన, సిగ్గుచేటైన సంఘటన చోటుచేసుకుంది. దేశ గౌరవానికి, సార్వభౌమత్వానికి ప్రతీక అయిన జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి తీవ్రంగా అవమానించారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగుడా గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.

ఏం జరిగిందంటే..?

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌదరి గూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాతీయ జెండాను తలకిందులుగా (ఆకుపచ్చ రంగు పైకి, కాషాయ రంగు కిందికి వచ్చేలా) తాడుకు కట్టారు.కనీసం చూసుకోకుండా ఆ జెండాను అలాగే పైకి ఎగురవేసి, ఆవిష్కరించారు.జెండా పైకి లేచి రెపరెపలాడుతున్నా.. అది తలకిందులుగా ఉందనే కనీస జ్ఞానం అక్కడ ఉన్న ఎవరికీ లేకపోవడం గమనార్హం.

మండల అధికారుల సాక్షిగా ‘సెల్యూట్ నిర్లక్ష్యం’!

ఈ వేడుకల్లో కేవలం సర్పంచ్, స్థానిక రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. మండల స్థాయికి చెందిన అన్ని శాఖల ఉన్నతాధికారులు సగర్వంగా హాజరయ్యారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవుల్లో ఉండి, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ అధికారులు సైతం జెండా తలకిందులుగా ఉందనే విషయాన్ని గుర్తించలేకపోయారు. అంతకంటే దారుణం ఏంటంటే… జెండా తలకిందులుగా ఎగురుతున్నా, ‘జనగణమన’ జాతీయ గీతం పూర్తయ్యేంత వరకు అధికారులందరూ ఏమాత్రం చలించకుండా అలాగే నిలబడి సెల్యూట్ చేస్తూ ఉండిపోయారు. దేశభక్తి అంటే కేవలం ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ కొట్టడమేనా.. కళ్లెదుట జాతీయ జెండాకు అవమానం జరుగుతుంటే చూసే కనీస బాధ్యత లేదా అని ప్రజలు మండిపడుతున్నారు.

జెండాను తప్పుగా ఎగరేస్తే చట్టం ఏం చెబుతోంది?

భారతదేశంలో జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002’ మరియు ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ – 1971’ (జాతీయ గౌరవ నిందల నిరోధక చట్టం) ప్రకారం జాతీయ జెండాను అవమానించడం తీవ్రమైన నేరం. చట్టం ప్రకారం కాషాయ రంగు కిందకు వచ్చేలా తలకిందులుగా జెండాను ఎగరేయడం (ఇన్వర్టెడ్ డిస్‌ప్లే) స్పష్టమైన చట్ట ఉల్లంఘన. ఇది జెండాను ఉద్దేశపూర్వకంగా తృణీకరించడమే అవుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను బహిరంగంగా అగౌరవపరిచినా, నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించినా నేరస్తులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

పదవుల ఊడటం ఖాయం

ప్రభుత్వ అధికారులు లేదా ప్రజాప్రతినిధులు ఇలాంటి తప్పులకు బాధ్యులైతే, వారిపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతో పాటు పదవి నుంచి తొలగించే అవకాశం కూడా ఉంటుంది.రాజకీయ నాయకులు, అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట!ఈ ఘటన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి, అజ్ఞానానికి అద్దం పడుతోంది. జాతీయ జెండాను ఎలా పడితే అలా ఎగురవేయడం చట్టరీత్యా నేరం. ఫ్లాగ్ కోడ్ నిబంధనలపై కనీస అవగాహన లేని వీరు ప్రజాప్రతినిధులుగా ఎలా కొనసాగుతారు? ఒక సామాన్యుడు తప్పు చేస్తే చట్టాలు మాట్లాడే అధికారులు.. తాము వేదికలపై ఉండి ఇంత పెద్ద తప్పు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఆ సమయంలో అధికారుల కళ్ళు మూతపడ్డాయా? దేశ గౌరవాన్ని బజారున పడేసిన ఈ మండల స్థాయి అధికారులు, రాజకీయ నాయకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని మేధావులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో దేశానికే అవమానం తెచ్చిన చౌదరి గూడ సర్పంచ్‌పై, అక్కడ ఉండి కూడా తప్పును సరిదిద్దని అధికారులపై ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *