= కూలుతున్న పైకప్పు.. నెత్తిపై పడుతున్న పెచ్చులు
= తరగతి గదిలో వాన.. బయట కోతుల భయం
= ఇప్పటికే పలువురు విద్యార్థులకు, ఆయమ్మకు తీవ్ర గాయాలు
= మాకంటే చిన్న పిల్లలకైనా కొత్త బడి కట్టించండి సార్..!
= కన్నీరు పెట్టిస్తున్న కిషన్ నగర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఆవేదన
= స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్న పసిప్రాణాలు
= చోద్యం చూస్తున్న అధికారులు

వేద న్యూస్, ఫోకస్ టీమ్ :
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామంలో బడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో రామో అన్న భయం.. కూర్చొని చదువుకుందామంటే నెత్తి మీద కురుస్తున్న వాన.. ఊడి పడుతున్న పైకప్పు పెచ్చులు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తే కోతుల దాడులు.. ఇది రంగారెడ్డి జిల్లా, ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న నరకం. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల పసిపిల్లల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, సురక్షితమైన భవనం నిర్మించాలని ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా వేడుకుంటున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

మాకంటే చిన్న పిల్లల మీద ఈ స్లాబ్ పడితే వాళ్ల పరిస్థితి ఏంటి?

‘మా బడి పైకప్పు పెచ్చులు ఊడిపడి ఇప్పటికే నలుగురైదుగురు విద్యార్థుల తలలు పగిలాయి. మొన్నటికి మొన్న ఆయమ్మపై కూడా పడ్డాయి, ఆమెకు మెడ దగ్గర తీవ్ర గాయమై ఆసుపత్రి పాలైంది. పది రోజులైనా ఆమె బడికి రాలేదు. మాకంటే చిన్న పిల్లల మీద ఈ స్లాబ్ పడితే వాళ్ల పరిస్థితి ఏంటి? భయపడుతూ చదువుకోలేకపోతున్నాం.. వెంటనే కొత్త భవనం మంజూరు చేయాలి..’ అని పదవ తరగతి విద్యార్థి రెహాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మా తర్వాత వచ్చే పిల్లలకైనా భవిష్యత్తు ఉండాలి..

మరో టెన్త్ క్లాస్ విద్యార్థి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘పెచ్చులు ఊడిపడటంతో ఆయమ్మకు ఏకంగా మూడుసార్లు గాయాలయ్యాయి.. మా కళ్లెదుటే ఇదంతా జరుగుతోంది.. మాకు స్కూల్ లేకపోయినా పర్వాలేదు.. కానీ మా తర్వాత వచ్చే చిన్న పిల్లలకైనా భవిష్యత్తులో ఓ మంచి కొత్త స్కూల్ కట్టించండి సార్’ అని ట్యాల హర్షవర్ధన్ అధికారులను వేడుకున్నాడు. తమ ప్రాణాల కంటే తోటి పిల్లల భవిష్యత్తు కోసం ఆ విద్యార్థి పడుతున్న తపన అధికారుల నిర్లక్ష్యానికి చెంపపెట్టులాంటిది.

లోపల ఉంటే వాన.. బయటకొస్తే కోతులు

తొమ్మిది, ఎనిమిదో తరగతులు చదువుతున్న విద్యార్థినులు సాయి వైష్ణవి, వైశాలి చెప్పిన మాటలు అక్కడి భయానక వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. ‘వాన పడితే అన్ని స్కూళ్లలో పిల్లలు లోపలికి వెళ్లి చదువుకుంటారు.. కానీ మా స్కూల్ కురుస్తుంది కాబట్టి మేము వాన వస్తే బయటికి పరుగెత్తాలి.. బయట కూర్చుందామంటే కోతుల గుంపులు వచ్చి భయపెడుతున్నాయి.. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మస్తు గాయాలవుతున్నాయి.. ఇంత కష్టంగా ఉన్న ఈ పురాతన కాలం నాటి బిల్డింగ్‌లో మేం ఎలా చదువుకోవాలి?’ అని వారు అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు బదులిచ్చే నాథుడే కరువయ్యాడు.

బోర్డులకే పరిమితమైన చారిటబుల్ ట్రస్టులు
బడి బయట గోడల మీద మాత్రం ‘బిల్డింగ్ బ్లాక్స్ – బంగారు తల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో..’ అని పెద్ద అక్షరాలతో రంగులు వేసి రాసి ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువుకుంటున్న ఈ పిల్లల దుస్థితి, కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ భవనం ఆ ట్రస్ట్ వారికి ఎందుకు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం పేరు కోసం బోర్డులు వేసుకోవడం కాకుండా, నిజంగా సేవాభావం ఉంటే ఆ ట్రస్ట్ వారు ఈ భవన నిర్మాణానికి ఎందుకు ముందుకు రావడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అధికారుల్లో చలనం వచ్చేది ఎప్పుడు? న్యాయం జరిగేదెన్నడు?
చిన్నారుల ఆవేదన చూస్తుంటే విద్యావ్యవస్థపైనే నమ్మకం సన్నగిల్లుతోంది. ఒక పక్క ఉపాధ్యాయులకు, విద్యార్థులకు గాయాలవుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం దారుణం. ఏదైనా ఘోరం జరిగి పసి ప్రాణాలు పోయాక తూతూ మంత్రంగా పరామర్శించడం కాదు.. తక్షణమే విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించాలి. కిషన్ నగర్ జెడ్పీహెచ్ఎస్ కు నూతన భవనాన్ని మంజూరు చేసి, ఈ విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. అప్పుడే ఈ పసిపిల్లలకు నిజమైన న్యాయం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *