వేద న్యూస్, హనుమకొండ:
ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS), తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండలోని భీమారంలోని స్కిల్ స్టోర్క్ పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, నీటి వనరుల పొదుపు, నేల సంరక్షణ, ప్లాస్టిక్ రహిత పర్యావరణం తదితర అంశాలపై విద్యార్థులకు ఆకర్షననీయమైన చిత్రాలతో అవగాహన కల్పించారు.
అడవుల నరికివేత, జీవవైవిధ్య క్షీణత, వన్యప్రాణుల ఆవాసాల విధ్వంసం, నీటి కొరత, ప్లాస్టిక్ కాలుష్యం వంటి సమస్యలను వివరిస్తూ ప్రకృతిలోని ప్రతి జీవికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్‌ను ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు నాగేశ్వర్ రావు అందించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ప్రకృతిని ప్రేమిస్తూ, పర్యావరణ పరిరక్షకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ విద్యను ప్రోత్సహిస్తున్న స్కిల్ స్టోర్క్ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ప్రకృతి, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని OWLS ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమానికి సహకరించిన సీనియర్ కోఆర్డినేటర్ చంద్ర ప్రకాష్ రు, డీన్ కల్నల్ శ్రీ ప్రశాంత్ పవార్రు , ప్రైమరీ కోఆర్డినేటర్ విశీ జయంత్ , మ్యాథ్స్ టీచర్ చైతన్య కి ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ విద్యకు ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, జీవరాశుల పట్ల దయ, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం చూపిస్తున్న చొరవ, సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
భావితరాలకు పచ్చని ప్రకృతిని అందించేందుకు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని OWLS పిలుపునిచ్చింది. ప్రతి విద్యార్థి మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం, నీటిని పొదుపు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పక్షులు, జంతువులు, అడవులను కాపాడటంలో భాగస్వామి కావాలని సూచించింది. “ఈరోజు పిల్లలకు ప్రకృతి విలువను నేర్పితేనే రేపటి తరాలు ప్రకృతిని కాపాడగలవు. ప్రతి విద్యార్థి ఒక పర్యావరణ పరిరక్షకుడిగా ఎదగాలి” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.
