•  ఆందోళన వద్దు.. అవగాహన పెంచుకోండి
  •  ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ యూ.సురేశ్

వేద న్యూస్, జమ్మికుంట:
వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నది. ఫీవర్, నీరసం, దగ్గు, వాంతులు వంటి లక్షణాలతో జనం అవస్థలు పడే చాన్సెస్ ఉంటాయి. పరిసరాల అపరిశుభ్రత కారణంగా వచ్చే వ్యాధులతో పాటు ఆహార కాలుష్యం వల్ల సీజనల్ డిసీజెస్ తో ప్రజలు అనారోగ్యం పాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సీజనల్ డిసీజెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలనే విషయాలపై ఐఎంఏ హుజూరాబాద్, జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి, ‘సంజీవని’ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. అవేంటో మీరూ చదివి తెలుసుకోండి..

వర్షాల వల్ల మురికి నీరు చేరి.. దోమలు ఎక్కువైపోయాయి. పైగా వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు అధికమవుతాయి. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, తిన్న ఆహారం జీర్ణంకాక పోవడం వంటివి సీజనల్ వ్యాధులుగా చెప్పుకోవచ్చు. వానాకాలంలో వచ్చే మరి కొన్ని వ్యాధులు ఇన్‌ఫ్లుఎంజా, మలేరియా, డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరంతో పాటు హెపటైటిస్- ఏ. ఈ వ్యాధులు ప్రధానంగా వెలుగు చూస్తుంటాయి. ఈ వ్యాధులు బారిన అన్నీ వయసుల వారు పడుతుంటారు.

ఈ వ్యాధులు సోకడానికి ప్రధానంగా కలుషిత ఆహరం, మురికి నీరు. ఎక్కవ కాలం ఒకే ప్రాంతంలో నిలిచి ఉన్న మురుకి నీరు.. వాటి పై వాలే దోమలు ఈ వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సమయాల్లో చాలా మంది దగ్గుతూ కనిపిస్తారు. ఇలా ఒకరి నుంచి మరోకరికి దగ్గు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ముఖ్యంగా దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కొన్నిసార్లు మరింత ప్రమాదకరమైనవిగా మారుతాయి. అందుకే వాటిని ముందుగా గుర్తించి అశ్రద్ధ చేయకుండా.. చికిత్స చేయించుకోవాలి. ఇలాంటి సమయాల్లోనే ‘స్క్రబ్ టైఫస్’ అనే ప్రాణాంతక జ్వరం కూడా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈ జ్వరం కూడా డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది. కానీ దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

కలుషిత ఆహారం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. అనంతరం వైద్యుల సూచనల మేరకు కామెర్లు మలేరియా, డెంగ్యూ జ్వరం, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్, హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవాలి.

సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు:
 చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కరోనాను అరికట్టడంతో పాటు అతిసార వ్యాధిని, ఇతర సీజనల్ వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.
 తీసుకునే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. కలుషిత ఆహారం, నీటిని దూరంగా ఉంచడం వల్ల డయేరియా, టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు.
 డెంగ్యూ, మలేరియాల జ్వరాలు సోకకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించాలి.
 మనం నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కలా ఎక్కడా మురుగు నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
 వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.
పానీపూరీ , ఇతర జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
మాస్క్ ధరించడం వల్ల సాధారణ జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధుల రాకుండా జాగ్రత్త వహించవచ్చు.

 

 

కిడ్నీల ఆరోగ్యానికి ఈ సూచనలు పాటించండి: డాక్టర్ సురేశ్