BRS MLAs

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్ల చొక్కాలు, టీషర్టులపై నిరసన నినాదాలతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నరు.

అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలకు సంబంధించిన నినాదాలు, సందేశాలు ఉన్న దుస్తులతో ప్రవేశించేందుకు నిబంధనలు అనుమతించవని భద్రతా సిబ్బంది బీఆర్‌ఎస్‌ నేతలకు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కూడా పోలీసులతో దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.

అసెంబ్లీలోకి నినాదాలు ఉన్న నల్ల టీషర్టుతో అనుమతించకపోవడంతో మాజీ మంత్రి హరీష్‌రావు తన టీషర్టును తొలగించినట్లు సమాచారం. అయితే చొక్కా లేకుండా లోపలికి ఎలా అనుమతిస్తామని భద్రతా సిబ్బంది ప్రశ్నించినప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదని తెలుస్తోంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేటీఆర్‌, హరీష్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ లోపలికి వెళ్లకముందే బీఆర్‌ఎస్‌ నేతల నిరసనతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులతో వ్యవహరించిన తీరును కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దాడి లేదా దురుసు ప్రవర్తనకు పాల్పడటం సరికాదని వారు పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *