= ఒకరిద్దరు మినహా కానరాని ముఖ్యనేతలు
= పదేళ్లు దర్జా ఒలకబోసిన నేతలు ఇప్పుడెక్కడ?
= గల్లీల్లో కనిపించని మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు..
= పైనుంచి ఆదేశాలు వస్తేనే అరకొర హడావుడి
= 2034 తామే అధికారంలో ఉంటాం అంటున్న కాంగ్రెస్
= గులాబీ లీడర్లలో మాత్రం కనిపించని చలనం
= జగిత్యాల సభతో బాస్ ఇచ్చిన జోష్‌ ఏది?
= కేడరల్లో నైరాశ్యం.. పక్కచూపులు చూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం
= ఇప్పటి నుంచే అలర్ట్ కావాలంటున్న గులాబీ సైన్యం

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో
తెలంగాణలో పదేళ్ల పాటు తిరుగులేని అధికార పీఠాన్ని అనుభవించిన నాడు గులాబీ దళపతులు.. నేడు ప్రతిపక్షంలోకి రాగానే క్షేత్రస్థాయిలో సైలెంట్ అయిపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాడు మంత్రులుగా, కీలక పదవుల్లో ఉంటూ దర్జా ఒలకబోసిన హేమాహేమీలు.. ఇప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, క్షేత్రస్థాయిలో క్యాడర్‌కు అండగా నిలబడేందుకు ముందుకు రావడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో కేటీఆర్, హరీశ్ రావు వంటి ఒకరిద్దరు నాయకులు మాత్రమే ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతుండగా, మిగతా జిల్లాల అధ్యక్షులు, మాజీ మంత్రులు మాత్రం ఇంటికే పరిమితమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వైఖరితో కిందిస్థాయి క్యాడర్‌లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది.

ఆదేశాలు వస్తేనే హడావుడి.

గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ, హడావుడి చేసిన నేతలు.. ఇప్పుడు పూర్తిగా ముఖం చాటేశారు. పార్టీ అధిష్ఠానం పైనుంచి ఏదైనా నిర్దిష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప, వీరు సొంతంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఆ ఆదేశాలు వచ్చినప్పుడు కూడా కేవలం మీడియా ముందో, ఆఫీసులకో పరిమితమై అరకొర హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో జనాల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే 2034 వరకు సీఎంగా ఉంటానని, కాంగ్రెస్ సుస్థిర పాలన అందిస్తుందని ధీమాగా ప్రకటిస్తుంటే.. దానికి కౌంటర్ ఇచ్చేలా గులాబీ లీడర్లలో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం.

కేటీఆర్, హరీశ్ తప్ప మిగతావారు గప్‌చుప్
ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బాధ్యతను కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రమే భుజాన వేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలపై వీరుద్దరే వాయిస్ వినిపిస్తున్నారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఇదే విషయాన్ని బాహాటంగా చెబుతున్నారు. ‘కేటీఆర్, హరీశ్ రావు అన్నలు మాత్రమే కాంగ్రెస్ వైఫల్యాలపై ఫైట్ చేస్తున్నారు. మిగతా ముఖ్యనేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంలో మాజీ మంత్రులు ఘోరంగా విఫలమవుతున్నారు’ అని జిల్లా స్థాయి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాస్ ఇచ్చిన జోష్‌ను నీరుగారుస్తున్న ఇన్చార్జులు
మొన్నటి జగిత్యాల బహిరంగ సభలో గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ధ్వజమెత్తే ప్రసంగం, ఇచ్చిన పిలుపుతో పార్టీ క్యాడర్‌లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. నిస్తేజంలో ఉన్న గులాబీ సైన్యం బాస్ స్పీచ్‌తో మళ్లీ యాక్టివ్ అయింది. అయితే, అధినేత కల్పించిన ఆ ఉత్సాహాన్ని క్షేత్రస్థాయిలో నిలబెట్టడంలో జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు తీవ్రంగా విఫలమయ్యారు. ఆ సభ తర్వాత కూడా వారు ఎక్కడా పార్టీని ఉత్సాహపరిచేలా, క్యాడర్‌ను కలుపుకుపోయేలా కార్యాచరణ రూపొందించుకోలేదనేది జగమెరిగిన సత్యం.

ఇప్పటి నుంచే సిద్ధం కాకపోతే మునిగిపోవడం ఖాయం
రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల పక్షాన నిలబడి పోరాడితేనే తిరిగి అధికారం దక్కుతుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పునాదులు వేసుకోకపోతే, మళ్లీ ఓటమి తప్పదని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. నాయకులు ఇలాగే ఏసీ రూములకే పరిమితమైతే, కిందిస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్ క్రమంగా వేరే పార్టీల వైపు చూసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా గులాబీ పార్టీ పెద్దలు అలర్ట్ అయి.. నిస్తేజంగా ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులను, మాజీ మంత్రులను యాక్టివ్ చేయాలని, నిరంతరం ప్రజల్లో ఉండేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని క్షేత్రస్థాయి కార్యకర్తలు గట్టిగా కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *