వేద న్యూస్, చందుర్తి:

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఆటో, ట్రాలీ డ్రైవర్లకు శుక్రవారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్‌ ఆటోలు, వాటిలో ప్రయాణించే విద్యార్థుల భద్రత, మోటార్‌ వెహికిల్స్‌ చట్టంలోని నిబంధనలు, అధిక లోడ్‌, అధిక ప్రయాణికులను ఎక్కించడంపై ఉన్న నిషేధం గురించి సవివరంగా తెలిపారు.

ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్‌లో అప్రమత్తత అవసరం, వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని డ్రైవర్లకు సూచించారు. అదేవిధంగా స్కూల్ ఆటోలలో విద్యార్థుల సంఖ్యను పరిమితి కంటే ఎక్కువగా ఎక్కించరాదని, ప్రయాణంలో ఎటువంటి అజాగ్రత్త కలిగిన ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని హెచ్చరించారు.

 సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..చిన్నారుల ప్రాణ భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, మీ జాగ్రత్త ఒక కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుందని చెప్పారు. ఎస్ఐ రమేష్‌ మాట్లాడుతూ.. ఓవర్‌లోడింగ్, అధిక వేగం వలన జరిగే ప్రమాదాలు క్షణాల్లో ప్రాణాలు తీస్తాయి.. కాబట్టి నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పోలీసులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.