•  అత్యధిక ముప్పులో ఉష్ణమండల అరణ్యాలు
  • భూమి జీవనాధారం, అరణ్యాలకూ డేంజర్
  • హై-రిస్క్ ఫారెస్ట్స్, హై-వాల్యూ రిటర్న్స్: కో-బెనిఫిట్స్ అసెస్మెంట్ ఫర్ డెసిషన్-మేకర్స్ పేరిట యూఎన్‌ఈపీ నివేదిక

వేద న్యూస్, డెస్క్:

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఇపి.) తాజా నివేదిక ప్రకారం ప్రపంచ పర్యావరణ వ్యవస్థలు, మానవ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సుమారు 391 మిలియన్ హెక్టార్ల ఉష్ణమండల అరణ్యాలు నాశనానికి అత్యధిక ముప్పులో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచంలోని మొత్తం 1.6 బిలియన్ హెక్టార్ల అరణ్య భూభాగంలో దాదాపు పావు వంతుకు సమానం.

 

 

యూ.ఎన్.ఇ.పి. విడుదల చేసిన “హై-రిస్క్ ఫారెస్ట్స్, హై-వాల్యూ రిటర్న్స్: కో-బెనిఫిట్స్ అసెస్మెంట్ ఫర్ డెసిషన్-మేకర్స్” అనే శీర్షిక గల నివేదికలో, ఈ అరణ్యాలు ప్రపంచ వాతావరణ సమతుల్యత, నీటి భద్రత,  5 కిలోమీటర్ల పరిధిలో నివసించే సుమారు 53 మిలియన్ మంది ప్రజల జీవనాధారా వ్యవస్థలకు మూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ ఉష్ణమండల అరణ్యాలు కేవలం జంతు నివాస ప్రదేశాలు కాకుండా, ప్రకృతి నిర్మించిన మౌలిక వసతులుగా వ్యవహరిస్తున్నాయి. వాటి నష్టం అనేక ప్రాథమిక జీవన వ్యవస్థలకు దెబ్బతీస్తుంది.

అరణ్యాల జీవావరణానికి అందిస్తున్న ముఖ్య సేవలు:

వాతావరణ నియంత్రణలో ఈ అరణ్యాలు ప్రపంచం ఉద్గారించే మొత్తం ఫాసిల్(శిలాజ) ఇంధన కార్బన్‌లో దాదాపు సగాన్ని, అంటే సుమారు 13.1 ± 1.4 గిగాటన్నుల కార్బన్ డైయాక్సైడ్ ను ప్రతి సంవత్సరం శోషిస్తాయి. నీరు, నేల రక్షణలలో ఈ వ్యవస్థలు ప్రతి సంవత్సరం 2.3 మిలియన్ టన్నుల నైట్రోజన్, 527 మిలియన్ టన్నుల సోయిలు, సడిమెంట్‌ను నిల్వ చేసి నదులు, ఆనకట్టలు, విద్యుత్ ప్రాజెక్టులను రక్షిస్తాయి.

 

భూక్షయాన్ని వర్షపు నీటి ప్రవాహలనుండి రక్షించి భూమిలోనికి నీటిని తమ వేర్లద్వారా పంపించి జలపలకాన్ని పెంచి వృథాగా పోయే నీటిని.. భూగర్భ నీటిని పెంచుటలో సహకరిస్తాయి. వర్షపాతం పునరుద్ధరణలో అరణ్యాలు ప్రాంతీయ వర్షపాతం‌లో 10–14% వంతును పునరావృతం చేస్తాయి, వ్యవసాయం, నదీ వ్యవస్థలను నిలిపి ఉంచుతాయి.

ప్రపంచ ఆర్థిక రక్షణ లో వరదలు, భూకంపాలను మరియు తుఫాన్ల వల్ల కలిగే నష్టాలను తగ్గించి, సుమారు 81 బిలియన్ అమెరికన్ డాలర్లు వరకు స్థూల జీడీపీ నష్టాన్ని నిరోధిస్తాయి.

ఖండాల వారీగా ప్రమాద కేంద్రాలు:

యూ.ఎన్.ఇ.పి. విశ్లేషణ ప్రకారంగా ఆఫ్రికా ఖండంలో అరణ్య సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య అత్యధికం. ఆసియా-పసిఫిక్ ప్రాంతాలు, ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా, అధిక ముప్పులో ఉన్న అరణ్య సమీప జనాభా అత్యధికంగా కలిగి ఉన్న ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి.

అమెజాన్ అరణ్య మలుపు స్థానం:

రిపోర్ట్ ప్రకారం.. అమెజాన్ లోయలో 20–40% అరణ్య నష్టం సంభవిస్తే అది ఒక పరివర్తన బిందువు వద్దకు చేరుతుందని హెచ్చరించింది. ఆ స్థితిలో అరణ్య-వర్షపాతం పరస్పర సంబంధం బలహీనపడి, ఉష్ణ అరణ్యాలను పొడి సవన్నా ప్రదేశాలుగా మార్చే ప్రమాదం ఉంది.

ఆర్థిక లోటు, విధానపరమైన చర్యల అవసరం:

యూ.ఎన్.ఇ.పి. స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్స్-2025 నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరానికి 216 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లోటు భర్తీ చేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అందించే 400 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యవసాయ సబ్సిడీలలో పావు వంతు ఈ దిశగా మార్చడమే ఈ లోటును సగానికి తగ్గించగలదని పేర్కొనబడింది.

యూ.ఎన్.ఇ.పి. సూచనలు:

ఆర్.ఇ.డి.డి పథకానికి ఆర్థిక మద్దతు పెంపు. స్థానిక, ఆదివాసీ సమాజాల ఆధ్వర్యంలో అరణ్య పరిరక్షణ బలోపేతం. అరణ్య రక్షణను జాతీయ వాతావరణ మార్పు అనుకూల విధానాల్లో అనుసంధానం చేయడం. 

“అరణ్యాలు కేవలం కార్బన్ నిల్వలు కాదు-అవి మన ఆహారం, నీరు, మరియు ఆర్థిక వ్యవస్థల ప్రాణాధారాలు.” అని యూ.ఎన్.ఇ.పి. కార్యనిర్వాహక అధికారి ఇంగర్ ఆండర్సన్ పేర్కొన్నారు. యూ.ఎన్.ఇ.పి. ఈ నివేదిక ప్రపంచ దేశాలకు అరణ్య పరిరక్షణను అగ్రగామి ఆర్థిక వ్యూహంగా మలచాలని విజ్ఞప్తి చేస్తోంది. ఒక్క హెక్టారు అరణ్యాన్ని కాపాడటం జాతీయ ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాల పరంగా సూక్ష్మ పెట్టుబడికి మించి ఫలితాలను అందిస్తుంది.

 

రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, సంయుక్త కార్యదర్శి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, మాజీ సహాయ ఆచార్యులు, జెఎన్టియుహెచ్.