- పచ్చటి ప్రకృతి ఆనవాళ్ల ‘దేవునూరు’
- ఇనుపరాతిగుట్టలకు అతి సమీపంలో ఊరు
- వ్యవసాయమే గ్రామస్తుల ప్రధాన ఆదాయ వనరు
- జానపద పరిశోధనలో వేగు చుక్క బిరుదురాజు స్వగ్రామం
- తొలి సర్పంచ్‌గా కుడితాడి రాజన్న.. ప్రస్తుత ఫైట్‌లో నెగ్గేదెవరో?
వేద న్యూస్, హన్మకొండ:
పచ్చటి ప్రకృతి ఆనవాళ్లు ‘దేవునూరు’ గ్రామ సొంతం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గ్రామ నలుమూలల ఎటు చూసినా.. గుట్టలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, కష్టజీవులు, వ్యవసాయమే ఆలంబనగా సాగే మనుషులు కనిపిస్తారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూరు గ్రామ.. సమీపంలోని ఇనుపరాతి గుట్టలు… ప్రకృతి పరిమళత్వానికి మారు పేరు అని చెప్పొచ్చు.
రామరాజు జన్మించిన ఊరు
జానపద పరిశోధనలో వేగు చుక్క బిరుదురాజు రామరాజు స్వగ్రామం ‘దేవునూరు’.. వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ గ్రామంలో సుమారు సుమారుగా 2,100 ఓట్లు ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొనసాగుతున్న ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో వెరీ టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు తెలుస్తున్నది.
గ్రామ తొలి సర్పంచ్ కుడితాడి రాజన్న
దేవునూరు గ్రామ తొలి సర్పంచ్‌గా కుడితాడి రాజన్న సేవలందించారు. ఆ తర్వాతి క్రమంలో కుడితాడి లింగన్న, ఏ.కొలె రాజేశ్వర్‌రావు, బి.అప్పని మల్లయ్య, రాజుగారి జగన్నాధం,ఏ.కృష్ణా రెడ్డి,.బి.నాగుర్ల శంకరయ్య,రత్నాకర్ రెడ్డి,చిర్ర వీరయ్య, రాజుగారి అరుణ, పొడిశెట్టి స్వామి, తుమ్మనపల్లి రాజేంద్ర-శ్రీనివాస్, చిర్ర కవిత- కుమార్‌లు పని చేశారు. గ్రామ ప్రథమ పౌరులుగా వీరు అందరి వారి టర్ములలో గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు తమ వంతు కృషి చేశారు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికలలో పోటీ రసవత్తరంగా మారింది. పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల మధ్యే ఉండనుందని తెలుస్తున్నది. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి హింగే రవీందర్, కాంగ్రెస్ తరఫున రాజుగారి అరుణ, బీజేపీ బలపరిచిన గాజుల సంపత్ బరిలో నిలవగా, స్వతంత్ర అభ్యర్థిగా కొంగంటి సందీప్ బరిలో నిలిచారు.
మరి కొన్ని గంటల్లోనే జరగనున్న ఎన్నికల్లో ఈ సారి 2025 సర్పంచ్ ఎన్నికలలో గెలిచే ప్రథమ పౌరుడు ఎవరనేది ప్రజలు తేల్చనున్నారు.


