వేదన్యూస్ వరంగల్ :
100 పడకలకు విస్తరణ, రూ. 1.73 కోట్లతో అత్యాధునిక పరికరాలు ప్రారంభం
వరంగల్ ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రి (REH) అభివృద్ధిలో భాగంగా రూ. 75 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద లు ప్రారంభించారు.
అనంతరం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (HDS) సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
వరంగల్ రీజనల్ ఐ హాస్పిటల్‌ను అత్యాధునిక వైద్య సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రోగులకు మెరుగైన సేవలందించడమే కాకుండా, ఆసుపత్రిని అన్ని విధాలా బలోపేతం చేసేందుకు
సిబ్బంది కొరత లేకుండా, అవసరమైన వైద్య పరికరాలను వెంటనే అందుబాటులోకి తెంచేందుకు కృషి చేస్తాం అని మంత్రి పేర్కొన్నారు.
వరంగల్ చుట్టుపక్కల జిల్లాల వారికి ఈ ఆసుపత్రి కేరాఫ్ అడ్రస్‌గా మారాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ. ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయినా వర్కర్స్ విధినిర్వహణలో ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని, విధులకు భంగం కల్పించకుండా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించుటకు వైద్య అధికారులు ముందుండాలని ఈ సందర్భంగా మంత్రి గారు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఫ్రీ బస్సు వలన సుధీర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు వైద్య సేవలు అందించాలని, ఎవ్వరికీ అదనంగా డబ్బులు ఇవ్వరాదని బోర్డు లు ఏర్పాటు చేయాలని మంత్రిగారు పేర్కొన్నారు.


