- భారత పేటెంట్ మంజూరు
వేద న్యూస్, వరంగల్:
స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధిలో జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్ఐటీ వరంగల్) పరిశోధకులు మరో కీలక విజయాన్ని సాధించారు. చక్కెర ఆధారిత సేంద్రీయ అణువులను ఉపయోగించి యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చడంతోపాటు, ఆ విద్యుత్తు సహాయంతో నీటి నుంచి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతకు భారత ప్రభుత్వం ఈ నెల 10న పేటెంట్ మంజూరు చేసింది.
ఎన్ఐటీ వరంగల్ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుబ్బయ్య నాగరాజన్, డాక్టర్ అరుణ్ కుమార్ రాచమల్ల, భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ రాజబోయిన రాకేష్ కుమార్, డాక్టర్ మడతిల్ నవనీత్ ఈ ఆవిష్కరణలో భాగస్వాములయ్యారు. భారత పేటెంట్ కార్యాలయం 2026 నవంబర్ 10న ఈ ఆవిష్కరణకు పేటెంట్ నంబర్ 609006ను మంజూరు చేసింది.
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని దోనిపాముల గ్రామానికి చెందిన రాచమల్ల అరుణ్ కుమార్ పేటెంట్ సాధించిన పరిశోధకులలో ఉన్నారు.
అరుణ్ మరో పేటెంట్
పొందడం
పట్ల తల్లిదండ్రులతో పాటు దోనిపాముల ఊరి ప్రజలు, అరుణ్ స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
చిన్నపాటి కదలికలతో విద్యుత్తు, నీటి నుంచి హైడ్రోజన్
మన చుట్టూ జరిగే కదలికలు, కంపనలు, రాపిడి వంటి ప్రక్రియల్లో వృథా అవుతున్న యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చే ట్రైబోఎలక్ట్రిక్ నానోజనరేటర్ సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ పరిశోధనలో ప్రత్యేకంగా రూపొందించిన చక్కెర ఆధారిత నాఫ్తలిమైడ్ అణువులను పత్తి వస్త్రంలోని సెల్యులోజ్ ఫైబర్‌లపై హైడ్రోజన్ బంధాల సహాయంతో క్రమబద్ధంగా అమర్చారు. ఈ మాలిక్యులర్ సెల్ఫ్ అసెంబ్లీ విధానం ద్వారా పదార్థాల విద్యుత్ ఉత్పత్తి పనితీరును గణనీయంగా మెరుగుపరిచారు.
ప్రయోగాల్లో ఈ పరికరం 364 వోల్టుల విద్యుత్ వోల్టేజ్‌ను, చదరపు మీటరుకు 19.4 వాట్ల పవర్ డెన్సిటీని ప్రదర్శించింది. అంతేకాకుండా, ఉత్పత్తి చేసిన విద్యుత్తును వినియోగించి ప్రయోగశాల స్థాయిలో నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి, సాంకేతికత సామర్థ్యాన్ని నిరూపించారు.
అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్‌లో పరిశోధన ప్రచురణ
ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ విలే ప్రచురించే అడ్వాన్స్డ్ సుటేబుల్ సిస్టమ్స్ జర్నల్‌లో 2025 ఆగస్టులో ప్రచురితమయ్యాయి.
ఈ పరిశోధనా పత్రంలో డాక్టర్ అరుణ్ కుమార్ రాచమల్ల మొదటి రచయితగా, ప్రొఫెసర్ సుబ్బయ్య నాగరాజన్ కరస్పాండింగ్ రచయితగా వ్యవహరించారు. ఇదే పరిశోధనా బృందానికి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ రాచమల్ల, ప్రొఫెసర్ సుబ్బయ్య నాగరాజన్ గతంలో కూడా చక్కెర ఆధారిత అణువులను ఉపయోగించి వంగే గుణం కలిగిన సేంద్రీయ సెమీకండక్టర్లను అభివృద్ధి చేశారు.
ఆ పరిశోధన 2022లో ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రచురించే గ్రీన్ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ ఆవిష్కరణకు భారత ప్రభుత్వం ఇప్పటికే పేటెంట్ నంబర్ 524613ను మంజూరు చేసింది.ఈ రెండు పరిశోధనల్లోనూ డాక్టర్ అరుణ్ కుమార్ రాచమల్ల మొదటి రచయితగా, ప్రొఫెసర్ సుబ్బయ్య నాగరాజన్ కరస్పాండింగ్ రచయితగా ఉన్నారు.
