= నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా?
= వలసవాదులకే పట్టం కడుతున్నారా..?
= ఎప్పటి నుంచో జెండా మోసిన వారి పరిస్థితి ఏంటి?
= ఎవరిని అందలం ఎక్కిస్తున్నారు..
= ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లోనూ వలసవాదులకే ప్రాధాన్యత
= పేదల దగ్గర ఇళ్లు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడిందీ వారే
= నియోజకవర్గంలో ‘గులాబీ బ్యాచ్’ పెత్తనం
= సెటిల్మెంట్లు, దందాలు చేసే లీడర్లపైనా దృష్టి పెట్టాల్సిందే
= కొండా దంపతుల పక్కన చేరి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న దళారులు
= తూర్పుపై డీసీసీ అధ్యక్షుడి మౌనం ఎందుకు ?
= ఇదీ.. నిజమైన కాంగ్రెస్ వాదుల అంతరంగం

వేద న్యూస్, ఎల్.కే (ప్రత్యేక ప్రతినిధి)
వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోందనే అంశం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారం చేపట్టాక క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సొంత పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా విపక్షంలో ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ జెండాను మోసి, నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను కాపాడిన అసలైన కార్యకర్తలకు ఇప్పుడు తగిన న్యాయం జరుగుతుందా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిన్నటివరకు పక్క పార్టీలో ఉండి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ వలసవాదులకే ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోందని, వారికే పట్టం కడుతున్నారనే ఆందోళన నిజమైన కేడర్‌లో వ్యక్తమవుతోంది.

వలస నేతలదే అక్రమ వసూళ్లు
పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం కొందరు దళారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల వల్ల అబాసుపాలవుతోంది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఏర్పాటైన ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో నిజమైన కాంగ్రెస్ వాదుల కంటే, పక్క పార్టీ నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజల దగ్గరకు వెళ్లి ఇల్లు ఇప్పిస్తామంటూ అంటూ నమ్మబలికి అక్రమంగా డబ్బులు వసూలు చేసింది కూడా ఈ బీఆర్ఎస్ వలస బ్యాచేనని సొంత పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారి వల్ల ప్రభుత్వ ఆశయానికి, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దందాలపై మురళీ దృష్టి పెట్టాలి
పార్టీ పదవుల కేటాయింపులను గమనిస్తే, నియోజకవర్గ సంస్థాగత పదవుల్లోనూ వారికే అందలాలు దక్కాయనే వాదన వినిపిస్తోంది. దీంతో వారు లభించిన పదవుల అండ చూసుకుని నియోజకవర్గంలో సెటిల్మెంట్లు, వసూళ్లు, దందాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ రెండ్రోజుల క్రితం మాస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఇళ్ల కమిటీలకే పరిమితం కాకుండా, నియోజకవర్గంలో పెరిగిపోయిన సెటిల్మెంట్లు, దందాలు చేసే వలస లీడర్లందరిపై కూడా కొండా మురళీ గట్టిగా దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నిజమైన కేడర్ కోరుకుంటోంది. కొండా దంపతుల పక్కన చేరి భజన చేస్తూ, లోపల మాత్రం పార్టీకి చెడ్డపేరు తెస్తున్న దళారులను గుర్తించి దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డీసీసీ అధ్యక్షుడి మౌనం ఎందుకు?
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిణామాలు, పార్టీ బలోపేతంపై నిరంతరం దృష్టి సారిస్తున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆయుబ్ తీరుపై కూడా ఇప్పుడు కార్యకర్తల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఆయుబ్.. కొండా దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, కార్యకర్తల ఆవేదనపై ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ వలస నేతల పెత్తనంపై ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

పరిస్థితి ఇలాగే ఉంటే..
అధికారంలో ఉన్నాం కదా అని వలస వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుని, పార్టీ కోసం కష్టపడ్డ సొంత కేడర్‌ను గాలికి వదిలేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అసలైన కాంగ్రెస్ వాదులు గుర్తుచేస్తున్నారు. దళారులు, అక్రమార్కుల చేతుల్లోకి పార్టీ వెళ్లడం వల్ల ప్రభుత్వ పథకాలకు చెడ్డపేరు రావడమే కాకుండా, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి గనుక ఇలాగే కొనసాగితే, రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని, తక్షణమే అధిష్టానం, కొండా దంపతులు దీనిపై సరైన నిర్ణయాలు తీసుకోవాలని హస్తం పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

అవినీతిని సహించని కొండా దంపతులు
అవినీతిని, అక్రమాలను ఎంతమాత్రం సహించని కొండా దంపతుల పక్కన కొందరు దళారులు, స్వార్థపరులు చేరి వారిని పక్కదారి పట్టిస్తున్నారని, దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, కొండా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల కోసం, సొంత లాభాల కోసం భజన చేస్తూ.. క్షేత్రస్థాయిలో దందాలు, వసూళ్లకు పాల్పడుతున్న ఇటువంటి కోవర్టులను కొండా దంపతులు తక్షణమే పసిగట్టి దూరం పెట్టాలని వారు కోరుతున్నారు. కష్టకాలంలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసి, అండగా నిలిచిన అసలైన నిస్వార్థ కార్యకర్తలను, నమ్మకమైన అభిమానులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించినప్పుడే తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుందని హస్తం శ్రేణులు బలంగా ఆకాంక్షిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *