నిచ్చనెక్కి.. ఇంట్లోకి దూరి..!
= లొంగిపోవాల్సిందే.. లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తా..
= కాంట్రాక్ట్ ఉద్యోగినిపై జీపీవో వేధింపుల పర్వం
= మహిళ ఇళ్లు కనపడేలా సీసీ కెమెరా ఏర్పాటు
= వచ్చిపోయే కదలికలు గమనిస్తూ వేధింపులు
= నిందితుడు ప్రభుత్వ గ్రామపాలనాధికారి
= పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
= వెంటనే కేసు నమోదు చేసి మహిళకు భరోసానిచ్చిన పోలీసులు
వేద న్యూస్, ఫోకస్ టీమ్:
మహిళల భద్రతపై ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులే వాటిని అపహాస్యం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలో ఒక మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగినిని పొరుగునే నివసిస్తున్న గ్రామ పరిపాలన అధికారి వేధిస్తున్న ఘటన కలకలం రేపింది. ఓ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేసే ఓ మహిళను పక్కనే నివసించే ప్రభుత్వ ఉద్యోగి జీపీవో గత మే నెల నుండి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిది. భర్త ఇంట్లో లేని సమయంలో ఏకంగా నిచ్చెన వేసి ఇంటి లోపలికి ప్రవేశించిన జీపీవో సదరు మహిళను అసభ్యకరంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నాకు లొంగిపోవాలి, లేకపోతే నీ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తాను’ అంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిరంతర నిఘా.. మానసిక వేదన..
కేవలం ఇంటివద్దే కాకుండా, ఆమె కదలికలపై నిఘా ఉంచేందుకు ఏకంగా ఆమె ఇంటి బయట సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఆమె ఏ సమయానికి ఇంటికి వస్తుంది, వెళ్తుందో పసిగట్టి వేధింపులను తారస్థాయికి చేర్చాడు. అంతేకాకుండా, ఆమె పనిచేసే కార్యాలయంపై అనవసరంగా ఆర్‌టీఐ దరఖాస్తులు వేస్తూ వృత్తిపరంగా కూడా ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది.
కేసు నమోదు చేసి మహిళకు భరోసానిచ్చిన పోలీసులు
నిందితుడి అరాచకాలను భరించలేక, తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో జూలై 11న బాధితురాలు తొర్రూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు జీపీవోపై 329(3), 78 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎఫ్‌ఐఆర్ తర్వాత కూడా..
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, సదరు జీపీవోలో మార్పు రాలేదు. పైగా, ‘నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నా అంతూ చూస్తా..’ అంటూ బయటకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలిని నిందితుడు నిరంతరం బెదిరిస్తున్నాడు. అంతేకాదు ‘మిడ్ నైట్ కూడా వస్తా..’ అంటూ తన ఇంటికి వచ్చి బెదిరించడంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనలకు లోనవుతోంది. ప్రభుత్య ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ఒక మహిళా పరువు తీయడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది.
