వేద న్యూస్, హనుమకొండ :
నేటి సమాజంలో మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారి తమ బాధ్యతలను నిర్వర్తించాలని వరంగల్ షీటీం సీఐ కే.సుజాత పేర్కొన్నారు. జాగ్రత్తగా మెలగడం ద్వారా మహిళలపై జరిగే నేరాలను చాలా వరకు నియంత్రించవచ్చని ఆమె స్పష్టం చేశారు. హనుమకొండలోని హంటర్ రోడ్డు కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో షీటీం ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, టీ-సేఫ్ యాప్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ సుజాత మాట్లాడుతూ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని అన్నారు. అలాగే ఒంటరిగా లేదా తెలియని ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా టీ-సేఫ్ యాప్ వినియోగించుకోవాలని, దాని ఉపయోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ పని ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులు, ఆకతాయుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని హెచ్చరించారు.
మహిళలపై ఎవరైనా అనుచితంగా లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే భయపడకుండా వెంటనే వరంగల్ షీటీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ నేరాల విషయంలో టోల్‌ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అదేవిధంగా సీపీ వాట్సాప్ నెంబర్ 8712685257, షీటీం సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్‌ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, నేరస్థులపై కౌన్సిలింగ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ప్రీతీ, అధ్యాపక బృందం, షీటీం ఎస్‌ఐ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
