= పార్టీ వీడుతున్న సీనియర్ నేతలు

= గాంధీ భవన్‌ వేదికగా ఆగ్రహ జ్వాలలు

= పాత తరం వర్సెస్ కొత్త తరం అన్నట్లుగా పరిస్థితి

= జీవన్ రెడ్డి నిష్క్రమణతో మొదలైన ముసలం

= అదే బాటలో ఆలోచన చేస్తున్న ధర్మపురి సంజయ్?

= మంత్రి పదవిపై కోమటిరెడ్డి బహిరంగ విమర్శలు

= పీఠం దక్కుంటే అడుగు ఎటువైపు?

= వలస నేతలకే ప్రాధాన్యమా? సుదీర్ఘ అనుబంధం ఉన్న నేతల ఆవేదన 

= రేవంత్ రెడ్డి టీమ్ సెగను చల్లార్చేనా?

 

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో:

 

తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటుండటం, మరికొందరు బహిరంగంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు గాంధీ భవన్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచిన బలమైన స్తంభాలు ఇప్పుడు బీటలు వారుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

40ఏళ్ల అనుబంధం తెంచుకున్న జీవన్ రెడ్డి

ముఖ్యంగా, నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీతో అనుబంధాన్ని తెంచుకోవడం అధిష్టానానికి పెద్ద దెబ్బనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకులకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న వాదనకు ఈ పరిణామం బలాన్ని చేకూర్చింది. జీవన్ రెడ్డి నిష్క్రమణ కేవలం ఒక వ్యక్తి వెళ్లడం మాత్రమే కాదు, పార్టీ పట్ల విధేయతతో ఉండే పాత తరం నాయకత్వం ఆలోచన ధోరణికి అద్దం పడుతోంది. సీనియర్లను గౌరవించుకోవడంలో విఫలమవుతున్నామన్న భావన కేడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది.

అసంతృప్తిగా ధర్మపురి సంజయ్

ఇక ఇదే క్రమంలో దివంగత పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా పార్టీ వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాల కాలంగా తమ కుటుంబానికి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని పక్కన పెట్టి, ఆయన అసంతృప్తి గళం విప్పడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, పార్టీ నిర్ణయాల్లో తమను భాగస్వాములను చేయకపోవడం వంటి అంశాలే సంజయ్‌ను ఈ దిశగా ఆలోచింపజేస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెబితే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తన పట్టును కొంత కోల్పోయే ప్రమాదం ఉంది.

మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి

మరోవైపు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీలో మరింత సెగ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో తన గెలుపు ద్వారా పార్టీకి బలం చేకూర్చిన రాజగోపాల్ రెడ్డి, తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే సమీకరణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు చోటు దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ ఆయనలో కొనసాగుతోంది. ఒకవేళ ఈసారి కూడా ఆయనకు నిరాశే ఎదురైతే, రాజగోపాల్ రెడ్డి తన తదుపరి అడుగు ఎటు వేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇలాగే దూరమైతే..

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నాయకులను బుజ్జగించి, పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో అధిష్టానం వైఫల్యం చెందితే, అది రాబోయే రోజుల్లో పార్టీ మనుగడపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అసంతృప్తితో ఉన్న ఈ కీలక నేతలు ఒకవేళ పార్టీకి దూరమైతే, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అసమ్మతి జ్వాలలను ముఖ్యమంత్రి, పీసీసీ ఏ విధంగా చల్లారుస్తారో వేచి చూడాలి.

బయట పడని ఎందరో..

వీరితో పాటు పార్టీలో మరికొంత మంది సీనియర్ నేతలు సైతం తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అంతర్గత చర్చల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసి, కష్టకాలంలో అండగా నిలిచిన తమను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి లేదా జూనియర్లకు ప్రాముఖ్యతనిస్తున్నారనేది వీరి ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల భర్తీలోనూ, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ తమ సలహాలకు విలువ ఇవ్వడం లేదని, కనీసం అపాయింట్‌మెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉందని వారు ఆవేదన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నిశ్శబ్ద అసంతృప్తి ఏ క్షణమైనా బహిర్గతమై, పార్టీలో మరిన్ని గ్రూపు రాజకీయాలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.