= రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్
= ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్న మోడీ-షా ద్వయం
= గులాబీ గూటికి కమలం సెగ
= బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్?
= మల్లారెడ్డికి సైతం బంపర్ ఆఫర్?
= వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీకి 5 సీట్లపై జోరుగా ప్రచారం
= మల్లారెడ్డి కోడలికి ఎంపీ సీటు హామీ?.. సోషల్ మీడియాలో వైరల్
= కొందరు అసంతృప్త కాంగ్రెస్ నేతలూ బీజేపీ టచ్ లోకి..
= ఈనెల 10న ప్రధాని మోదీ పర్యటన..
= సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ
= ఉద్యమాల గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడేనా?

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో:
తెలంగాణపై మరోసారి కమలం పార్టీ దృష్టి సారిస్తోందా..? ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి ముగియగానే తన తదుపరి లక్ష్యంగా ‘మిషన్ తెలంగాణ’ను ఎంచుకుందా? ఢిల్లీ పెద్దల కన్ను ఇప్పుడు ఉద్యమాల గడ్డపైనే పడిందా? తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని, రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ పక్కా స్కెచ్ వేస్తోందా..? అంటూ అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, బీజేపీ జాతీయ నాయకత్వం తన పూర్తి శ్రద్ధను తెలంగాణపై మళ్లించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చడానికి సిద్ధమయ్యారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై ‘డబుల్ అటాక్’
రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఏకకాలంలో ఢీకొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు బీఆర్‌ఎస్ పతనావస్థను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ రెండు పార్టీలను ప్రజల్లో పలచన చేసేందుకు సరికొత్త రాజకీయ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియా నుంచి వీధి పోరాటాల వరకు భారీ కార్యాచరణను రూపొందించింది.

గులాబీ గూటికి కాషాయ సెగ
బీజేపీ ఇప్పుడు తన వ్యూహాన్ని కేవలం సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా, ‘ఆపరేషన్ ఆకర్ష్’కు పదును పెట్టింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గులాబీ పార్టీకి చెందిన కొందరు రాజ్యసభ ఎంపీలతో బీజేపీ అధిష్టానం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో గెలుపు గుర్రాలను ఎంచుకుని, వారికి టికెట్ల హామీ ఇస్తూ కాషాయ తీర్థం పుచ్చుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మల్లారెడ్డి ఫ్యామిలీకి బంపర్ ఆఫర్?
తాజా రాజకీయ పరిణామాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మల్లారెడ్డి కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో ఏకంగా 5 అసెంబ్లీ సీట్లు ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన కోడలికి ఎంపీ సీటు కూడా ఇస్తామనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలే అధినేత కేసీఆర్, మల్లారెడ్డికి క్లాస్ పీకినట్లు సమాచారం. అయితే, తాను బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని మల్లారెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ.. లోలోపల చర్చలు మాత్రం ఆగలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈనెల 10న మోదీ పర్యటన అందకోసమేనా?
తెలంగాణలో జోష్ పెంచేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభ కేవలం ప్రసంగానికే పరిమితం కాకుండా, భారీ చేరికలకు వేదిక కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు ప్రధాని సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సభ ద్వారా తెలంగాణ గడ్డపై బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది.

సంస్థాగత ప్రక్షాళన.. కొత్త నాయకత్వం
కేవలం చేరికలపైనే కాకుండా, పార్టీని లోపలి నుంచి బలోపేతం చేసేందుకు బీజేపీ చర్యలు చేపట్టింది. వచ్చే 10 రోజుల్లో పార్టీ నాయకత్వంలో కొన్ని కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రలు, బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మార్చుకునేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

కాషాయ రెపరెపలు సాధ్యమేనా?
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. తెలంగాణలో త్రిముఖ పోటీ తప్పనిసరి అనిపిస్తోంది. కాంగ్రెస్ తన పట్టును నిలుపుకోవాలని చూస్తుంటే, బీఆర్‌ఎస్ పునర్వైభవం కోసం పోరాడుతోంది. ఈ క్రమంలో బీజేపీ తన ‘మిషన్ తెలంగాణ’ను ఎంతవరకు విజయవంతం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.