•   బల్దియా ఆఫీసుకు కూతవేటు దూరంలోనే సదరు డివిజన్
  •  రాష్ట్ర రెండో రాజధానిగా పేరు గాంచిన వరంగల్‌లో ఇదీ పరిస్థితి
  •  గ్రేటర్ వరంగల్ 29 వ డివిజన్‌లో డ్రెయినేజీ నిర్వహణ గిట్లనా ఉంటే..?
  •  బయటకొస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని చెబుతూ కాలనీవాసుల ఆవేదన
  •  తమ సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులు, పాలకవర్గానికి వేడుకోలు

వేద న్యూస్, గ్రేటర్ వరంగల్:

స్వయంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధి డివిజన్‌లోనే ఇదీ పరిస్థితి.. అందులోనూ సదరు డివిజన్ బల్దియా ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. జీడబ్ల్యూఎంసీ 29వ డివిజన్‌లోనీ 5, 6 బ్లాక్‌లు గల బొమ్మల సత్తయ్య గల్లీలో మూడు నెలల క్రితం నూతన సీసీ రోడ్డు, తాగు నీళ్ల పైప్ లైన్, నూతన డ్రైనేజీ నిర్మాణం కోసం పనులు ప్రారంభించి.. మొదట మంచి నీళ్ల పైప్ లైన్ వేశారు. కొన్ని రోజుల తర్వాత రోడ్డుకు ఇరువైపుల కంకర వేసీ సీసీ రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తుండగా, కాలనీ వాసులు డ్రైనేజీ నిర్మాణం గురించి ప్రశ్నించగా.. ‘‘అదిగో వేస్తాం, ఇదిగో వేస్తాం’’ అంటూ.., ‘‘వర్షాలు కురుస్తున్నాయి ఆగిన తర్వాత వేస్తాం’’ అంటూ.., ‘‘ఒకసారి వేస్తాం, ఇంకోసారి వెయ్యం’’ అని రకరకాల కారణాలు చెబుతూ నాలుగు నెలలకు పైగా ఎటువంటి పనులు చేయకుండా నాన్చుతున్నారు.

అస్తవ్యవస్తంగా డ్రైనేజీ
ఇప్పుడు అకస్మాత్తుగా డ్రైనేజీ లేకుండా సీసీ రోడ్డు వేయడానికి సిద్ధం అయ్యారు. దాంతో తమ కాలనీ డ్రైనేజీ చాలా పురాతనమైందని, శిథిలావస్థకు చేరుకొని కాలువ పునాది రాళ్లు.. కృంగిపోయి చిందర వందరగా ఉండి మురికి నీరు సక్రమంగా ప్రవహించకుండా, దుర్గంధభరితంగా అయి దోమలకు నిలయంగా మారాయని కాలనీవాసులు చెబుతున్నారు. డ్రైనేజీ రాళ్లు అస్తవ్యస్తంగా ఉండటం కారణంగా ఎలుకలు మట్టిని తవ్వుకుని ఇళ్లలోకి ప్రవేశిస్తూ.. నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రజలు వివరిస్తున్నారు.

 

మేయర్ పట్టించుకోవాలి
తమ కాలానికి డ్రైనేజీ వ్యవస్థను నూతనంగా నిర్మించిన తర్వాతనే సీసీ రోడ్డు వేయాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు. రోడ్డు పై వేసిన కంకర కారణంగా వాహనాల మాట అటుంచితే.. కనీసం మనుషులు కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. రాకపోకలకు స్కూల్ పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తు మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ అయి ఉండి కూడా ఇలాంటి పరిస్థితులు రావడం ఏంటని స్థానికులు వాపోతున్నారు.

నగర ప్రథమ పౌరురాలు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లోనే జనం సమస్యలను పట్టించుకునే నాథుడే లేకపోతే.. ఇక ఇతర డివిజన్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మేయర్ గారూ తన సొంత డివిజన్‌లో మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణపైన దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే క్షేత్రస్థాయి పర్యటనకు వస్తే మేయర్ గారూ సైతం తన సొంత డివిజన్‌కు వస్తే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు. తాను గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ ప్రజలకు దుర్గంధం నుంచి విముక్తి కలిగేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.