- జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం అభివృద్ధి కానే కాదు
- అది పట్టణ జీవ భవిష్యత్తును నాశనం చేయడమే
- పర్యావరణ విద్యావేత్త రవి బాబు పిట్టల ఆవేదన
హైదరాబాద్:
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి కాసు బ్రహ్మనందరెడ్డి (కేబీఆర్) పార్కు పరిధిలో ‘అభివృద్ధి’ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ప్రముఖ పర్యావరణ విద్యావేత్త, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ (ఔల్స్ ఎన్.జి.ఓ., టీజీ) సంయుక్త కార్యదర్శి రవి బాబు పిట్టల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని బలిపెట్టి చేసే పనులు నిజమైన ప్రగతి అనిపించుకోవని ఆయన స్పష్టం చేశారు.
ప్రకృతి అంటే కేవలం పచ్చదనం మాత్రమే కాదని, అది పక్షులు, జంతువులు, వృక్షాలు మరియు అమూల్యమైన జీవవైవిధ్యంతో కూడిన ఒక సజీవ పర్యావరణ వ్యవస్థ అని గుర్తుచేశారు. చెట్లను నరకడం, వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం, వాటి సహజ ఆవాసాలను ధ్వంసం చేయడం అభివృద్ధి కాదు, అది ముమ్మాటికీ వినాశనమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడవులే మన ఊపిరి అని, చెట్లు మనకు ప్రాణవాయువును, స్వచ్ఛమైన గాలిని, నీడను ఇస్తాయని రవి బాబు పిట్టల పేర్కొన్నారు.
ఊపిరితిత్తులుగా పాత్ర వహిస్తూ ప్రాణవాయువునందిస్తున్న పట్టణ పార్కుల జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం అభివృద్ధి కానే కాదు… అది మన భవిష్యత్తును నాశనం చేయడమే. పట్టణాల్లో ఉన్న పార్కులు కేవలం వినోద స్థలాలు కావు; అవి జీవవైవిధ్యానికి నిలయాలు, గాలి కాలుష్యాన్ని తగ్గించే సహజ శుద్ధి కేంద్రాలు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే జీవనాధారాలు. చెట్లు, పక్షులు, జంతువులు, సూక్ష్మజీవులు కలిసి ఒక సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తాయి. ఇలాంటి విలువైన ప్రకృతి సంపదను అభివృద్ధి పేరుతో తొలగించడం అనేది శాస్త్రీయంగా, సామాజికంగా తప్పు. నిజమైన అభివృద్ధి అంటే ప్రకృతిని కాపాడుతూ ముందుకు సాగడం. కాబట్టి పట్టణ పార్కులను రక్షించడం మన అందరి బాధ్యత—ఇవే మన నగరాల ఊపిరితిత్తులు, మన ఆరోగ్యానికి ఆధారం, మన భవిష్యత్తుకు బలమైన పునాది అని రవిబాబు వాపోయారు.
పక్షులు, జంతువులు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. అలాగే, పార్కులోని నీటి వనరులు వాతావరణాన్ని క్రమబద్ధీకరించడమే కాకుండా, భూగర్భ జలాలను రీచార్జ్ చేస్తూ జీవకోటికి ఆధారంగా నిలుస్తున్నాయని తెలిపారు. పర్యావరణానికి మరియు ప్రజలకు హాని చేయని రీతిలో సాగే పర్యావరణ అనుకూలమైన సుస్థిర అభివృద్ధే నిజమైన ప్రగతి అని ఆయన స్పష్టం చేశారు. నేడు మనం ప్రకృతిని, జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తే, రేపు మన భవిష్యత్తును మనమే చేజేతులా నాశనం చేసుకున్నట్లవుతుందని ఆయన హెచ్చరించారు. కేబీఆర్ పార్క్ అనేది నిర్మాణ స్థలం కాదని, అది ఒక సజీవ పర్యావరణ వ్యవస్థ అని గుర్తుచేస్తూ.. మన సహజ వారసత్వమైన ఈ పార్కును రాబోయే తరాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేబీఆర్ పార్క్ పరిరక్షణకై, సుస్థిర అభివృద్ధి కోసం ప్రజలు, పర్యావరణ ప్రేమికులు అంతా ఏకమై గళమెత్తాలని పిలుపునిచ్చారు. పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు చేసి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ.. అందరం కలిసి పచ్చని, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన హైదరాబాద్‌ను నిర్మించుకునే అవసరముందని రవి బాబు పిట్టల కోరారు.
కాసు బ్రహ్మనందరెడ్డి (కేబీఆర్) పార్కు వంటి అర్బన్ పార్కులు జంట నగరాలకు ఆక్సిజన్‌ను సమకూర్చే ఊపిరితిత్తుల వంటివి అని, వాహనాలు మరియు పరిశ్రమల నుండి వెలువడే హానికర గాలి కాలుష్యాన్ని తమ పత్రాల ద్వారా పీల్చుకొని ప్రతిగా ప్రాణవాయువును విడుదల చేస్తాయని, పట్టణ వాతావరణంలో గాలిలో తేమ (భాస్పోత్సర్గం) పెంచి చల్లదనాన్ని కలిగిస్తూ ఉష్ణోగ్రతలను తగ్గించి ఆహ్లాదకరమైన వాతావరణానికి కారణమవుతున్నాయని పర్యావరణవేత్త రవిబాబు పిట్టల పేర్కొన్నారు; అంతేకాకుండా ఈ పార్కుల్లో ప్రతిరోజూ వేలాది మంది ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, యోగా, వ్యాయామం వంటి ఆరోగ్యకర కార్యకలాపాలు చేస్తూ తమ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని, మధుమేహం, రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించుకోవడంలో ఈ పచ్చటి ప్రదేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పక్షుల కిలకిలారావాలు, సహజ వాతావరణం మధ్య సేదతీరుతూ స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకోవడం ద్వారా మనుషుల జీవన నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు.
ఇంత విలువైన పర్యావరణ సంపదను నాశనం చేయడం మూర్ఖత్వమని, ఈ అర్బన్ పార్కులను ఏ పరిస్థితుల్లోనైనా రక్షించడం మన అందరి తక్షణ బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
– రవిబాబు పిట్టల, ప్రముఖ పర్యావరణ విద్యావేత్త మరియు సంయుక్త కార్యదర్శి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ.