• కష్టజీవుల దరి చేరిన కార్పొరేట్ వైద్యం
  • వల్బాపూర్‌లో ఫ్రీ హెల్త్ క్యాంపు
  •  ఆదిత్య, అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో..
  •  వల్బాపూర్ గ్రామస్తులకు ఉచిత ఓపి: దేవేందర్ రెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట:

వీణవంక మండలం వల్బాపూర్ గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జమ్మికుంట ఆదిత్య, అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ, కల్తీ ఆహార పదార్థాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజూ తగినంత మంచినీరు తీసుకోవడంతో పాటు ఆకుకూరలు, కూరగాయలను ఉడికించి తీసుకోవాలని, సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

 

 

 

ప్రముఖ వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ.. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించి, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువతలో ఊబకాయం పెరుగుతోందని, బరువును నియంత్రించుకోవడం ముఖ్యమని తెలిపారు.

సొంత గ్రామం పై దేవేందర్ రెడ్డి మమకారం

ఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఎలుక దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ సేవలో బాలవికాస సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సంస్థ సహకారంతో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆదిత్య, అమృత ఆసుపత్రుల ఆధ్వర్యంలో గతంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత పరీక్షలు, మందులు అందించామని, భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. తమ స్వగ్రామమైన వల్బాపూర్ ప్రజలకు ఆసుపత్రిలో ఉచిత ఓపీ సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఉప సర్పంచ్ నామని విజేందర్..మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ.. ప్రతి మహిళ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ఇంటిని ఆరోగ్యానికి తొలి కేంద్రంగా మార్చాలని సూచించారు. బాలవికాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న 14 సెంటర్ల పరిధిలోని 180 గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ఆయా సెంటర్ల పరిధిలోని దాతల సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ స్వాతి, కరోబార్ రాజశేఖర్, పాలకవర్గ సభ్యులు, ఆదిత్య ఆసుపత్రి పీఆర్వోలు రఫిక్, శ్రీకాంత్, దుర్గాప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది అనిల్‌రావు, మహేష్, శ్రావణ్, రంజిత్, పూజ, అనూష, శృతి తదితరులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *