= స్వచ్ఛమైన పల్లె వాతావరణానికి చెల్లుచీటి
= విచ్చలవిడిగా గ్రానైట్ క్వారీల కార్యకలాపాలు!
= భరించలేనంతగా గ్యాస్ ప్లాంట్ నుంచి దుర్గంధ వాసన
= నిబంధనలకు నీళ్లొదులుతూ.. ఇష్టారాజ్య వ్యవహారాలు!
= ముక్కుపుటాలు అదురుతున్నయ్.. అనారోగ్యం బారిన ప్రజలు!

వేద న్యూస్, అంబీర్ శ్రీకాంత్
అభివృద్ధి మాటున పీల్చే గాలి కలుషితమవుతున్నదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. తీవ్రమైన పరిస్థితులు దాపురించకముందే తాము మేల్కొనకపోతే ఊరు వల్లకాడు అవుతుందని ఆందోళననూ వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు గ్రానైట్ కాలుష్యం..మరో వైపు బయో ఎనర్జీ గ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే దుర్గంధపూరిత వాసన వల్ల తాము భరించలేకపోతున్నామని సూరారం గ్రామ, సమీప ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని సూరారం వద్ద మెయిన్ రోడ్డుపైన ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి విపరీతమైన వాసన వెదజల్లబడుతోందని, దాంతో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెల్లడిస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం
జిల్లాలోనే పేరుగాంచిన గ్రానైట్ క్వారీల మైనింగ్ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నది. బహిరంగంగానే నిబంధనలను వారు ఉల్లంఘిస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ఈ క్వారీల నుంచి వచ్చే తెల్లటి దుమ్ము కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వ్యవసాయ భూములు, వందలాది పశువులు, జీవాలతో విలసిల్లే స్వచ్ఛమైన పల్లె వాతావరణానికి ఇక చెల్లు చీటి పడేట్టుగా కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్నది. గ్రానైట్ ధూళికే విలవిలలాడుతున్న ఈ పచ్చని ప్రకృతి మధ్యలో ఇప్పుడు కంప్రెస్డ్ ‘బయోగ్యాస్ ప్లాంట్’ రూపంలో మరో వికృత కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఈ ప్రాంతవాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఈ ప్లాంట్ ఈ ప్రాంత ప్రజలను, పశుపక్ష్యాదులను మాయమయ్యేలా చేస్తుందని ఆందోళన చెందుతున్నారు.

నిశ్శబ్ద నరకం.. ఇళ్లల్లో జనం బందీ!
గత కొంతకాలంగా సూరారం గ్రామంలో పరిస్థితి దారుణంగా మారింది. ప్లాంట్‌ నుంచి వెలువడే తీవ్రమైన దుర్వాసన కారణంగా గ్రామస్తులు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కును ఓ రకంగా కోల్పోయారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున గాలి వీచే దిశను బట్టి ఈ కంపు తీవ్రత మారుతోంది. గాలి ఊరి వైపు తిరిగినప్పుడు ఇళ్ల తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి లోపల బందీ అవ్వడం మినహా స్థానికులకు మరో దారి లేకుండా పోయింది. ప్లాంట్‌కు తెచ్చే సేంద్రియ వ్యర్థాలు, పశువుల పేడ వంటి ముడి పదార్థాలను బహిరంగంగా నిల్వ ఉంచడం, గ్యాస్ ప్రాసెసింగ్‌లో సరైన అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుర్వాసన వస్తోందని విపరీతంగా వచ్చే దుర్వాసనను బట్టి స్పష్టమౌతోంది. ప్లాంట్‌లో బయోగ్యాస్ ప్రక్రియలో భాగంగా హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా వంటి ఘాటైన వాయువులు విడుదలవుతాయి. వీటిని బయో-ఫిల్టర్ల ద్వారా నియంత్రించకపోతే గాలి విషతుల్యంగా మారుతుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ నుంచి వెలువడుతున్న దుర్వాసనకు కారణమదేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మానవాళితో పాటు మూగ జీవాదులకు ముప్పు
ప్లాంట్ నుంచి వెదజల్లబడే ఈ ఘాటైన వాసన నిరంతరం పీల్చడం వల్ల చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో శ్వాసకోస ఇబ్బందులు, ఉబ్బసం లక్షణాలు పెరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు నిరంతర తలనొప్పి, కళ్ల మంటలు, వికారం వాంతుల సమస్యతో బాధపడుతున్నారని, కడుపులో తిప్పేసే ఈ కంపు కారణంగా చిన్న పిల్లలు అన్నం తినడానికి కూడా మారాం చేస్తున్నారని తల్లులు కన్నీరు పెడుతున్నారు. సూరారం పరిసర ప్రాంతాలలోని పాడి పశువులు, మేకలు, గొర్రెల జీవనాధారమైన పచ్చిక బయళ్లు సైతం ఇప్పుడు ఈ గ్యాస్ ప్లాంట్ రసాయన గాలి ప్రభావానికి గురవుతున్నాయి. గాలి కలుషితమవడం వల్ల పశువులు మేత మేయడానికి ఇబ్బంది పడుతున్నాయని, వాటి ఆరోగ్యం క్షీణిస్తే తమ బ్రతుకులు రోడ్డున పడతాయని పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల చర్యలేవి?
పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), స్థానిక యంత్రాంగం ఈ ప్లాంట్ నిర్వహణపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్లాంట్ చుట్టూ గ్రీన్ బెల్ట్ (చెట్ల పెంపకం) ఉండాలి, అలాగే వ్యర్థాల నిల్వ అంతా పూర్తిగా మూసివున్న ట్యాంకులలోనే/ కంటైనర్లలోనే జరగాలి. కానీ ఇవేవీ ఇక్కడ సరిగ్గా అమలు కావడం లేదు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా, జనం రోగాల బారిన పడుతున్నా అధికారులు కనీసం ప్లాంట్‌ను సందర్శించి తనిఖీలు చేయకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్లాంట్‌లో లీకేజీలను అరికట్టేలా, అధునాతన ఫిల్టర్లు వాడేలా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ఈ ప్రాంతవాసుల ఆరోగ్యం, పచ్చని భూములు మరింత క్షీణించే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నారు.

అధికారులు మమ్ములను పట్టించుకుంట లేరు
లెంకలపల్లి వెంకటస్వామి, రైతు

మమ్ములను అధికారులు పట్టించుకుంటలేరు. ఓ దిక్కు కెమికల్ గ్యాస్.. మరో దిక్కు ప్లాంట్, మరో దిక్కు గ్రానైట్లు వీళ్లందరు చేయబట్టి మాకు కాలుష్యం ఎక్కువైంది. కూలోళ్లు నాటేయరమ్మంటే నాటేయ రావడం లేదు. వరి బెరుకలు ఏరడానికి కూడా రావడానికి మొగ్గు చూపుతలేరు. వాసన ఘోరంగా గలీజుగా వస్తున్నది. పశువులు నీళ్లు తాగుతలేవు., పిచ్చి పిచ్చి చేస్తున్నాయి. ఈ వాసనకు ఇటు దిక్కు ఉండాలనిపిస్తలేదు. ఏమన్న పని చేసుకుందామనుకున్న కానీ మాకు ఇక్కడ ఉండాలనిపిస్తలేదు. దూరం పోయి మేము ఉంటానం. ఇక్కడ గ్రానైట్లు, కెమికల్ గ్యాస్, డాంబర్ ప్లాంట్ వీటన్నింటిపైన అధికారులు పట్టించుకుంటలేరు. దయచేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరుకుంటున్న.
==============
గ్యాస్ వాసనకు పశువులు నీళ్లు తాగుతలేవు: రైతు బుచ్చయ్య

కెమికల్ గ్యాస్ చేయబట్టి మాకు వాసన విపరీతంగా వస్తాంది. దానితోటి పశువులు అసలు నీళ్లు తాగుతలేవు. పంటపొలాల కాడికి కూలోళ్లు వస్తలేరు. కెమికల్ గ్యాస్ చేయబట్టి మాకు మస్తు ఇబ్బందైతాంది. మా రైతాంగానికి నష్టం జరగకుండా సూడాల్నని మేము అధికారులను కోరుకుంటానం.
==============

ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమైతాంది:
హింగే భాస్కర్, రైతు, తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి కరీంనగర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు


కెమికల్ గ్యాస్ నుంచి వచ్చే వాసనకు సూరారం గ్రామ ప్రజలమైన మేము తీవ్ర ఇబ్బంది పడుతున్నం. అసలు బయటకు రావాల్నంటేనే భయమైతాంది. ముక్కుపుటాలు అదురుతున్నయ్. రాత్రివేళలో 7 గంటల నుంచి మొదలు తెల్లవారు జాము వరకు విపరీతంగా భరించలేనంత దుర్వాసన గోబర్ గ్యాస్ ప్లాంట్ నుంచి వస్తాంది. దాంతో పశుపక్ష్యాదులకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నది. పశువులు నీళ్లు తాగుతలేవు. మనుషులకూ అనారోగ్య ప్రమాదాలూ రానున్నాయి. పంట పొలాలు నాశనమయ్యేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఉన్నతాధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ విషయమై దృష్టి సారించాలె. ఓ వైపు గ్రానైట్ క్వారీల మైనింగ్, మరో వైపున ఈ గ్యాస్ ప్లాంట్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఈ ప్రాంతవాసులకు ఏర్పడుతున్నాయి. నిబంధనలు పాటించకుండా పర్యావరణ కాలుష్యం విపరీతంగా చేస్తున్న వీటిపైన తప్పనిసరిగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. రైతాంగానికి నష్టం జరగకుండా బాధ్యత వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *