• ఎల్‌నినో సంక్షోభంలో వ్యవసాయ రంగాన్ని బూచిగా చూపొద్దు
  • నీటి వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించాాలి
  • గడ్డు పరిస్థితులనుండి రైతును గట్టెకించగలగాలి

 

 

నీటి వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించాలి: నీటి సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు, నీటియాజమాన్యాలు సమగ్ర నీటి వినియోగ పద్ధతులను, నీటి వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించాలి. నీటిని సమగ్రతను, ఉపయోగాలను తప్పకుండ పాటించాలి కానీ కేవలం వ్యవసాయ రంగం మాత్రమే నీటిని ఎక్కువ వినియోగిస్తున్నది,

రైతులవల్ల భూగర్భ జలాలు, ఉపరితల జలాలు తగ్గిపోతున్నాయనడం, రైతును మాత్రమే మార్చి వరి, చెఱుకు లాంటి అధిక నీటి వినియోగ పంటలను వేయొద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖతో నీటి వినియోగాన్ని తగ్గించాలి అని రైతును, వ్యవసాయరంగాన్ని భూచిగా చూపి అన్నంపెట్టే రైతును అప్పులపాలు చేసి, వారు బతికుండడానికి ప్రభుత్వాలవైపు, అవి ఇచ్చే పథకాలవైపు ఎదురుచూసే బిక్షగాన్ని చేయాలనుకోవడం, ఈ రకమైన అశాస్త్రీయ ప్రచారం చేయడం సమంజసం కాదు. నీటియొక్క వినియోగాన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యవసాయేతర అనవసరపు వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించి సమగ్రంగా వాడుకుని విపత్తు గడ్డు పరిస్థితులనుండి గట్టెకించగలగాలి.

నీరు జాతీయ వనరు — ఏ ఒక్కరి సొంత ఆస్థి కాదు: ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మారడం, ఉస్నోగ్రతలు పెరగడం, నీటి వనరులు తగ్గడం, ఎండిపోవడం, వర్షపాతం తగ్గడం, బావుల్లో, కుంటాల్లో చెరువుల్లో, నదుల్లో, జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడం, తాగునీటి ఎద్దడి పెరగడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి కొరత వస్తుందని భావించి, రైతులను ఒక పంట సీజన్‌ను — ముఖ్యంగా యాసంగిలో వరి, చెరుకు మొదలగు నీటిని ఎక్కువగా తీసుకునే సాగును — వాయిదా వేయాలని కోరింది. కానీ నీటి సంక్షోభాన్ని కేవలం వ్యవసాయ రంగంపై మాత్రమే మోపడం న్యాయం కాదు; నీటిని అన్ని రంగాల్లో సమానంగా, బాధ్యతగా నిర్వహించాలి.

రైతుపై మాత్రమే భారం పడుతుందా? అన్నపూర్ణ అయిన ఈ భరత దేశానికి వ్యసాయమే వెన్నెముక. తిండిపెట్టే రైతే నిజమైన దేశ రక్షకుడు. అందుకే ఈ దేశం “జై జవాన్” నినాదంతో పాటు “జై కిసాన్” అని గౌరవించడం మన అందరికీ ఘర్వ కారణం. అయితే ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరి, చెరుకు వంటి పంటలకు ఎక్కువ నీరు అవసరమవుతుందని చెప్పడం నిజమే. అందుకే ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కంది, పెసర, మినుములు, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలవైపు మొగ్గు చూపాలని సూచిస్తోంది. అయితే ఈ సూచనలు రైతు ఇష్టానికి విరుద్ధంగా, అపరాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కాయగూరలు, ఆకుకూరలు, దుంపలు మొదలగు సూచించిన పంటలను తీవ్రమైన కోతుల బెడద నుండి రక్షించే మార్గం చూపకుండా, మార్కెట్ ధరలు, విత్తన లభ్యత, భూమి స్వభావం, నీటి సౌకర్యాన్ని పరిగణించకుండా ఉంటే అవి కేవలం ఆదేశాలుగా మారతాయి. పంట మార్పు క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ సంక్షేమాధికారులు, రైతులు కలిసి నీటి లభ్యత, నేల పరిస్థితి దృష్టిలో ఉంచి నిర్ణయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ భరోసా అవసరం: రైతు వరి లేదా చెరుకు వదిలేసి మిల్లెట్స్, పప్పుధాన్యాలు, నూనె గింజలు పండిస్తే వాటికి సరైన ధర, కొనుగోలు హామీ, ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉండాలి. లేకపోతే పంట పండించినా అమ్ముకోలేక, ధర తగ్గిపోయి నష్టపోతారు. పంట మార్పు సులభం కాదని, విత్తనాల లభ్యత, వరవరణ అనుకూలత, నేల అనుకూలత, నీటి సౌకర్యం, మార్కెట్ డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ ఆర్థికవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం “వరి వేయకండి” నీటిని ఎక్కువ తీసుకునే పంటలను వేయకండి అని మాత్రమే చెప్పకుండా, ప్రత్యామ్నాయ పంటకు ఖరీదైన ధర హామీ, బీమా, విత్తన సబ్సిడీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

నీటి కొరత వ్యవసాయానికే పరిమితం కాదు: హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో పరిశ్రమలు, హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్‌మెంట్లు, కార్ల వాష్ సెంటర్లు, నిర్మాణ రంగం భారీగా నీటిని వాడుతున్నాయి. తాగునీటితోనే కార్లు కడగడం, ఇళ్లను శుభ్రం చేయడం, అద్దాలు కడగడం, బాత్రూమ్‌ల్లో అధికంగా వాడడం వంటి వినియోగం తగ్గించాలి. ప్రభుత్వం వ్యవసాయంలో మాత్రమే నియంత్రణ విధిస్తే, పట్టణ ప్రాంతాల్లో విలాసవంతమైన నీటి వినియోగాన్ని నిర్లక్ష్యం చేయడం అన్యాయం. నీటి వనరుల నిర్వహణలో భూగర్భ, ఉపరితల నీటిని కలిపి, వివిధ రంగాల అవసరాలను సమతుల్యంగా పరిగణించాలని నిపుణుల అభిప్రాయం ఉంది.

పరిశ్రమలు, హోటళ్లు, శీతల పానీయాల కంపెనీలు: ఈ దేశ జాతీయ ఆస్తులలో ఒకటైన సహజ నీటి వనరులను తమ వ్యాపారం కోసం వినియోగించుకొని, ఒకేవ్యక్తికి ఆదాయాన్ని ఆర్జించే ఎన్నో రకరకాల విదేశీ శీతల పానీయాల, దేశీయ కంపెనీలు, మద్యం తయారు చేసే కంపెనీలు, బాటిల్డ్ వాటర్ యూనిట్లు, హోటళ్లు, పెద్ద పరిశ్రమలు, బహుళార్ధక ప్రైవేటు గృహ అపార్ట్మెంట్ల సముదాయాలు ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా లేదా ట్యాంకర్ల ద్వారా పెద్ద మొత్తంలో నీటిని విచ్చలవిడిగా వాడుకొని లాభాలు సొంతంగా సొమ్ముచేసుకుంటున్నారు, విదేశీ కంపెనీలు వారి దేశాలకు తమ లాభాలను డబ్బులను కరెన్సీ మార్చుకొని తీసుకుపోయి అందరికీ చెందే ఉపయోగ పడే ఈ దేశ నీటివనరులను కొల్లగొట్టి వాడుతున్నాయి. ఇవి లాభదాయక వ్యాపారాలు కాబట్టి, వాటి నీటి వినియోగానికి కఠినమైన కోటాలు, రీసైక్లింగ్ నిబంధనలు, ధర విధానం విధించాలి. తాగునీటి కొరత ఉన్నప్పుడు విలాస నీటి వినియోగాన్ని, వస్తువుల తయారీకి నీటిని సమృద్ధిగా ఇవ్వడం సమంజసం కాదు. ప్రభుత్వం తాగునీటిని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నట్లు ప్రకటించినా, ఆ సూత్రాన్ని పరిశ్రమల వినియోగంలో కూడా అమలు చేయాలి. అవసరమైతే విపత్కర పరిస్థితుల్లో వీటికి నీటి సరఫరా ఆపివేయాలి.

పట్టణ వినియోగంలో కూడా కట్టుదిట్టంచేయాలి: ఎత్తైన అపార్ట్‌మెంట్లు, ఐటీ పార్కులు, షాపింగ్ మాల్స్, హోటళ్లలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షపు నీటిని సేకరించడం, గ్రే వాటర్‌ను రీసైకిల్ చేసి మురుగునీటి పైపైన్లకు, గార్డెనింగ్‌కు వాడటం, డ్రిప్ సిస్టమ్స్ వాడటం వంటివి తప్పనిసరి చేయాలి. ప్రభుత్వం రైతులను మాత్రమే అడగకుండా, పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి ఆదా చర్యలను బలవంతంగా అమలు చేయాలి. ప్రైవేటు అక్రమ నీటి సరఫరా టంకర్ల వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలి. నీటి అక్రమ తరలింపు, అక్రమ వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షణలో ఉంచేందుకు నిఘా విజిలెన్స్ టీములను నియమించి పర్యవేక్షణలో నీటి అక్రమ నిల్వలు, నీటి అక్రమ తరలింపు వ్యాపారాలు అరికట్టాలి. నీటి నిర్వహణలో వర్షపాతం, ఉపరితల, భూగర్భ నీటిని కలిపి ప్రణాళిక వేయాలని సూచించబడింది.

వ్యవసాయంలో నీటి ఆదా కోసం సాంకేతిక చర్యలు: రైతులు పంట మార్చకుండా కూడా నీటిని ఆదా చేయవచ్చు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, మల్చింగ్, ఇన్-సిటు తేమ నిల్వ, ఫార్మ్ పాండ్లు, ఇంటర్‌క్రాపింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. పొడిగించిన పొడి కాలంలో పంట కీలక దశల్లో రక్షణ నీటిపారుదల, స్కిప్-రో నీటిపారుదల, యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ఫోలియర్ స్ప్రేలు వంటి చర్యలు కూడా సూచించబడ్డాయి. ప్రభుత్వం ఈ సాంకేతికతలకు సబ్సిడీ, శిక్షణ ఇస్తే రైతు పంట మార్చకుండానే నీటిని ఆదా చేయగలడు.

వాతావరణ ఆధారిత సలహాలు, రియల్-టైమ్ డేటా: వర్షపాతాన్ని రియల్-టైమ్‌లో పర్యవేక్షించడం, నేల తేమను అంచనా వేయడం, పంట పెరుగుదలను గమనించడం, వాతావరణ ప్రమాదాన్ని విశ్లేషించడం వంటివి చేస్తే రైతుకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ప్రభుత్వం వ్యవసాయ శాఖ, నీటి వనరుల శాఖ, వాతావరణ శాఖలు కలిసి ప్రతి మండలానికి వారానికి ఒకసారి నీటి లభ్యత, పంట సలహాలు ప్రకటించాలి. ఇలా చేస్తే రైతు అంచనాల మీద కాకుండా సైన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోగలడు.

నీటి కేటాయింపులో పారదర్శకత: జలాశయాల్లో ఎంత నీరు ఉంది, ఎంత తాగునీటికి, ఎంత వ్యవసాయానికి, ఎంత పరిశ్రమలకు కేటాయించారు అనే వివరాలు ప్రజలకు తెలియాలి. ప్రభుత్వం ప్రతి వారం జలాశయాల నీటి మట్టాలు, కేటాయింపులు, వినియోగం ప్రకటిస్తే రైతులు, పౌరులు నమ్మకంతో ఉంటారు. నీటి కేటాయింపులో పారదర్శకత లేకపోతే రైతులకు అనుమానం వస్తుంది, ప్రభుత్వంపై అపనమ్మకం పెరుగుతుంది. జలాశయాల నీటిని సమర్థవంతంగా వాడాలని కేంద్ర నీటి పరిషత్, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చారు.

కొన్ని విధానాల ద్వారా రైతు జీవనోపాధి ప్రశ్నగా మారుతోంది: రైతుకు తెలుసు ఎలా వ్యవసాయం చెయ్యాలో, ఏపంటలు ఏ వాతావరణంలో వేసుకోవాలో. ఆదివారి వెసులు బాటుకు వదిలెయ్యాలి. రైతుకు వ్యవసాయమే జీవనాధారం. పంట అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తారు, అప్పులు తీర్చుకుంటారు, పిల్లల చదువులకు డబ్బు ఇస్తారు. పంట మార్పు వల్ల ఆదాయం తగ్గితే రైతు ఆర్థికంగా నలిగిపోతాడు, అప్పుల భారం పెరుగుతుంది. అందుకే పంట మార్పును కేవలం ఆదేశంగా కాకుండా, రైతు ఆదాయాన్ని రక్షించే పథకంతో కలిపి అమలు చేయాలి. పంట మార్పు వల్ల నష్టం వచ్చే రైతులకు ప్రత్యేక పరిహారం లేదా మద్దతు ధర ఇవ్వాలి.

గ్రామీణ కూలీలు, కూలీ కార్మికుల సమస్యలొస్తాయి: పంట మార్పు వల్ల కేవలం రైతులు మాత్రమే కాదు, గ్రామీణ కూలీలు, కార్మికులు కూడా ప్రభావితమవుతారు. వరి సాగు తగ్గితే నాటడం, కోత వంటి పనులు తగ్గి కూలీలకు పని లేకుండా పోతుంది. ప్రభుత్వం రైతులకు విద్యుత్ సరఫరా కొనసాగించడం, గ్రామీణ కార్మికులకు మద్దతు ఇవ్వడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, అత్యవసర సిద్ధతలు బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టింది. కానీ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి, వేతన భరోసా కూడా అవసరం.

సమగ్ర నీటి వినియోగ విధానం: నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఒకే రంగంపై భారం మోపడం కాకుండా, అన్ని రంగాల్లో సమానంగా బాధ్యత వహించాలి. తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి, వ్యవసాయానికి సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు ప్రోత్సహించాలి, పరిశ్రమలకు రీసైక్లింగ్ నిబంధనలు విధించాలి, విలాసపు నీటి స్నానాలు, వ్యక్తిగత స్విమ్మింగ్ ఫూల్స్, ఓవర్ ఫ్లషింగ్ నీటివినియోగాన్ని తగ్గించాలి. అనవసరపు నీటి వినియోగాన్ని, పట్టణ ప్రాంతాల్లో నీటి ఆదా చర్యలు బలవంతంగా అమలు చేయాలి. నీటి వనరుల నిర్వహణలో ఆహార భద్రత, జీవనోపాధి, పర్యావరణ అవసరాలను సమతుల్యంగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.

రైతును వదిలి అందరినీ బాధ్యుల్ని చేయాలి: ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కేవలం రైతును మాత్రమే పంట మార్చమని అడగడం సరికాదు. హోటళ్లు, పరిశ్రమలు, శీతల పానీయాల కంపెనీలు, పట్టణ ప్రాంతాలు కూడా నీటి వినియోగంలో తగ్గుదల చూపాలి. అవసరమైతే విపత్కర పరిస్థితుల్లో వీటికి నీటి సరఫరా ఆపివేయాలి. ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ భరోసా, సాంకేతిక మద్దతు, ఆర్థిక రాయితీలు ఇస్తేనే పంట మార్పు విజయవంతమవుతుంది. నీటిని అన్ని రంగాల్లో సమానంగా, బాధ్యతగా నిర్వహించే విధానం అమలు చేస్తేనే ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా అధిగమించగలం. నీరు అందరిది. ప్రతి ఒక్కరు ఆదాచేసుకోవాలి. మానవులమైన మనం విజ్ఞతతో బాధ్యతగా ఈ జీవావరణ వ్యవస్థలో అన్నజీవులకు అందేలా చూస్తూ.. నీరు ప్రాణధారం కాబట్టి ఎంతో విలువైన ప్రతీ నీటి బొట్టు సమిష్టిగా ఒడిసి పట్టి, ప్రతీ నీటిబొట్టు విలువైనదని గుర్తించి, ఆదాచేసుకొని ఇతర జీవులతోపాటు మనమూ వినియోగించుకొని సుస్థిరతదిశగా జీవించాలి. అప్పుడే ఈ జీవావరణం సమాతుల్యంతో కూడిన జీవవైవిద్య సుస్థిరతతో కొనసాగుతుంది.

“జై జవాన్ — జై కిసాన్”

— రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, మాజీ సహాయ ఆచార్యులు, JNTUH, హైదరాబాద్ మరియు సంయుక్త కార్యదర్శి, ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ (OWLS) NGO, తెలంగాణ. సెల్: +91 9849425271.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *